న్యూఢిల్లీ: హైదరాబాద్, మీరట్‌లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్, మీరట్ అల్లర్ల నేపథ్యంలో కేంద్రం సూచన
న్యూఢిల్లీ: హైదరాబాద్, మీరట్‌లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్న ఏ చిన్న ఘటననైనా నివారించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని, శాంతి సామరస్యాలను పరిరక్షించాలని సూచించింది. మత ప్రదేశాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు, జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. శుక్రవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉన్నందున కేంద్రం రాష్ట్రాలకు ఈ సూచనలు చేసింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో జెండా కోసం జరిగిన అల్లర్ల సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మీరట్‌లో గత వారం జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే.