ముంబై: ప్రధాని నరేంద్ర మోదీపై మిత్రపక్షం శివసేన మరోసారి విరుచుకుపడింది. విదేశాల్లో దేశం పరువు తీయొద్దని ఆయనకు హితవు పలికింది. దేశంలోని అవినీతి గురించి అదేపనిగా ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ అవినీతి దేశమని పదేపదే ప్రస్తావించొద్దని, ఇలాంటి ప్రకటనలతో మున్ముందు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది.
'భారత్ లో అవినీతి ఎలా పెరిగిపోయింది, అవినీతిని రూపుమాపేందుకు తాము చేపడుతున్న చర్యలు గురించి దోహలో బహిరంగంగా ప్రధాని మోదీ వివరించారు. ఆయన మాటలకు సభికులు హర్షధ్వానాలు చేశారు. విదేశీ గడ్డపై భారత్ ప్రటిష్ఠను మంటగలిపార'ని పార్టీ పత్రిక 'సామ్నా'లో శివసేన విమర్శించింది.
అవినీతి పెరిగిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించింది. బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అవినీతి ఎందుకు తగ్గలేదని శివసేన ప్రశ్నించింది. అవినీతి గురించి గొంతు చించుకోవడానికి యూరప్, అమెరికా వెళ్లాల్సిన పని లేదని చురక అంటించింది. మాటలు కట్టిపెట్టి అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
ప్రధాని మోదీకి శివసేన చురక
Published Wed, Jun 8 2016 3:16 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement