పులి బోనులో క్యాబరే డాన్స్
పులి నోట్లో తల దూర్చడమంటే మాటలా? మధ్యప్రదేశ్ లో ఒక ఇంజనీరింగ్ కుర్రాడు దాదాపు ఇలాంటి పనేచేశాడు.
మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ జూకి వెళ్లి పులుల బోనులోకి దూకేశాడు. అంతేకాదు పులుల క్లబ్బులో క్యాబరే డాన్సర్ గా మారి నడుం ఊపి, కాలు కదిపి 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాడేశాడు.
ఆ కుర్రాడి పేరు యశోనందన్ కౌశిక్. వయసు 23 ఏళ్లు. ఇండోర్ లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ చదువుకుంటున్నాడు. సోమవారం జూకి వెళ్లి, ఇరవై అడుగుల ఎత్తైన బోను ఎగబాకి ఎక్కి, లోపలికి దూకేశాడు. లోపల డాన్సులు చేశాక, పులులు నీరుతాగేందుకు ఏర్పాటు చేసిన చిన్న నీటి గుంటలో ముఖం,కాళ్లు, చేతులు కడుక్కున్నాడు. ఈ తతంగమంతా దాదాపు అరగంట పాటు సాగింది. పులులకు ఈ డ్యాన్సు బాగా నచ్చిందేమో... తాపీగా కూర్చుని చూస్తూ ఊరుకున్నాయే తప్ప ఏమీ చేయలేదు.
అంతలో ఈ వింత చూసిన మిగతా పర్యాటకులంతా పరుగుపరుగున వెళ్లి జూ అధికారులకు చెప్పారు. వారు వచ్చి ఈ కుర్రాడిని బయటకు లాక్కొచ్చారు.
'మా అబ్బాయి గత నాలుగు రోజులుగా నిద్రపోలేదు. దానివల్లే ఇలా చేశాడేమో' అన్నారట కౌశిక్ తల్లిదండ్రులు.
గతేడాది అక్టోబర్ లో ఇలాగే ఒకాయన భువనేశ్వర్ లోని నందన్ కానన్ జూలోని సింహాల బోనులోకి ప్రవేశించి, మాంసం ముద్దై బయటకు వచ్చాడు. 2007 లో గువహటి జూ లో ఒకాయన బోనులో చేతులు దూర్చి మరీ తన సెల్ ఫోన్ లో పులుల ఫోటో తీయబోయాడు. ఆ ఫోనూ, ఆయన చెయ్యి బోనులోనే ఉండిపోయాయి.
అవును మరి... పులిని చూడాలనుకుంటే చూడొచ్చు. కాస్త దగ్గరికి వెళ్లి ఫోటో దిగాలనుకుంటే దిగొచ్చు. ఫరవాలేదులే అని మరీ జూలు పట్టుకుంటే .... వేటాడేస్తది. అన్ని పులులూ గ్వాలియర్ జూలో లాంటి పులుల్లా ఉండవు మరి !!