సగం రైలు టికెట్లు నగదుతోనే..
న్యూఢిల్లీ: దేశంలో 50 శాతం రైలు టికెట్లు ఇప్పటికీ నగదు రూపంలోనే ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. రైలు, బస్సు ప్రయాణాలపై రైల్ యాత్రి అనే వెబ్ సంబంధిత కంపెనీ అధ్యయనం జరిపింది. దేశంలోని 25 నగరాల్లో సుమారు 50 వేల మంది ప్రయాణికులు, 800 ట్రావెల్ ఏజెంట్ల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ మేరకు అధ్యయన ఫలితాలను వెల్లడించింది. 65 శాతం రైల్వే ప్రయాణికులు టికెట్ కొనుగోలును డిజిటల్ రూపంలో చేస్తుండగా, 50 శాతం రైలు టికెట్లు ఇప్పటికీ నగదు రూపంలోనే జరుగుతుండడం విశేషం.
చాలా మంది ప్రయాణికులు స్థానిక ఏజెంట్ వద్దకు వెళ్లి టికెట్ కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. టికెట్ కొనుగోలులో చెల్లించే 0.7 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలు ఏజెంట్లకు ఎంతో భారంగా మారినట్లు తేలింది. ఒక్కో ప్రొవైడర్‌ను బట్టి పేమెంట్ గేట్‌వే చార్జీలు 1.5 నుంచి 2 శాతం వరకు ఉన్నాయి. ఏజెంట్లు చెల్లించే 0.7 శాతంతో పాటు మిగిలిన మరో 0.7 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలను ప్రొవైడర్లకు తమ సొంత జేబుల్లో నుంచి చెల్లిస్తున్నారు.
ఇది తలకు మించిన భారంగా మారింది. వీటికితోడు ప్రయాణికుల నుంచి రూ.20–40 కమీషన్‌గా ఏజెంట్లు తీసుకుంటున్నారు. ఈ కారణాలతో డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లకుండా ట్రావెల్ ఏజెంట్లు నగదు చెల్లింపులు చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాగా 22న వారణాసి నుంచి మూడో మహమన ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.