ఎంసెట్‌కు సరే.. కానీ.. | Supreme Court accepted as lite way to Eamcet | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌కు సరే.. కానీ..

Published Sat, May 7 2016 5:19 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

ఎంసెట్‌కు సరే.. కానీ.. - Sakshi

ఎంసెట్‌కు సరే.. కానీ..

♦ ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే సమ్మతమన్న ఎంసీఐ
♦ సూత్రప్రాయంగా అంగీకరించిన సుప్రీంకోర్టు
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ఎంసెట్‌కు మార్గం సుగమమవుతోంది. కానీ దీనికి భారత వైద్య మండలి(ఎంసీఐ) కొన్ని షరతులు ప్రతిపాదించింది. వీటిని పరిశీలించిన ధర్మాసనం ఈ ఏడాది వరకు ప్రభుత్వ వైద్యకళాశాలల్లో మాత్రమే ప్రవేశానికి ఎంసెట్‌ను అనుమతించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినా... తుది నిర్ణయం మాత్రం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ జరపుతున్న చర్చల నివేదికను బట్టే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు కళాశాలల అసోసియేషన్లకు ప్రవేశపరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. వాటికి ‘నీట్’ నుంచి మినహాయింపు ఇవ్వబోమని పేర్కొంది. అలాగే ఇప్పటికే నీట్-1 రాసిన విద్యార్థులు జులై 24న జరగబోయే నీట్-2 పరీక్ష రాసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 వైద్య విద్యలో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) నిర్వహణపై పలు రాష్ట్రాలు, ప్రైవేటు వైద్య కళాశాలల అభ్యంతరాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సంబంధిత పిటిషన్లపై జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ శివకీర్తి సింగ్‌తో కూడిన ధర్మాసనం తిరిగి విచారణ చేపట్టింది. ఎంసీఐ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్ పలు నూతన ప్రతిపాదనలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ చట్టాలను అనుసరించి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకుని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తే తమకు సమ్మతమేనన్నారు.

అయితే, ప్రైవేటు కళాశాలలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత ప్రవేశ పరీక్షలు ఉండకుండా ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ అభ్యంతరం చెబుతూ తమకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు, రాష్ట్రస్థాయి చట్టాలతో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సైతం తామే ప్రవేశాలు కల్పిస్తామని ధర్మాసనానికి విన్నవించారు. దీనికి స్పందించిన జస్టిస్ అనిల్ ఆర్ దవే.. ప్రైవేటు కళాశాలలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు కళాశాలల అసోసియేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించబోమని చెప్పారు.

దీనిపై ప్రైవేటు కళాశాలల తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ స్పందిస్తూ ఒకవేళ నీట్‌ను తప్పనిసరైతే ఇకపై తాము మెరిట్‌లో పేద విద్యార్థులకు ఇస్తున్న 50 శాతం సీట్ల రిజర్వేషన్‌ను ఉపసంహరించుకుంటామన్నారు. దీనికి ధర్మాసనం స్పందించలేదు. ఎంసీఐ మరో ప్రతిపాదననూ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. తొలుత తాము జాతీయ పూల్‌లోని 15 శాతం సీట్లను ఉద్దేశించి ఏఐపీఎంటీ పరీక్ష నిర్వహించదలిచామని, అయితే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాము దీనిని నీట్-1గా మార్చామని చెప్పింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది విద్యార్థులు గైర్హాజరైనందున వారికి నీట్-2లో అవకాశం కల్పించేందుకు కోర్టు అనుమతించాలని కోరారు.
 
 సమయం కోరిన కేంద్రం
 కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. తాము నీట్ నిర్వహణపై రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలను స్వీకరించామన్నారు. వీటిపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ చర్చలు జరుపుతోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వారాంతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, తమ వైఖరి తెలిపేందుకు సోమవారం వరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం సమ్మతించింది. చివరగా జస్టిస్ అనిల్ ఆర్ దవే స్పందిస్తూ ‘ప్రైవేటు కళాశాలలు, వాటి అసోసియేషన్లు ప్రవేశ పరీక్ష నిర్వహించరాదన్న ఎంసీఐ ప్రతిపాదనను మేం సమ్మతిస్తున్నాం. అలాగే నీట్ ఉండాలన్న ప్రతిపాదనకూ సమ్మతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చా లేదా అనే విషయమై సోమవారం అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పే వైఖరిని బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement