
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటేరియన్లకు ఇచ్చే పెన్షన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మాజీ ఎంపీలకు పెన్షన్లు, రవాణ భత్యం, ఇతర సేవలు అందించడాన్ని సవాలు చేస్తూ ‘లోక్ ప్రహరి’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం కొట్టేసింది. అలహాబాద్ హైకోర్టు తమ పిటిషన్ కొట్టేయడంతో ఈ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
సంబంధిత చట్టాన్ని రూపొందించకుండా మాజీ ఎంపీలకు పెన్షన్లు అందించేందుకు పార్లమెంటుకు అధికారాలు లేవని ఆ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ‘రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ఒకటో జాబితా 73వ ఎంట్రీలో ఎంపీల ‘అలవెన్సుల’ గురించి ప్రస్తావన ఉంది. పెన్షన్, ఇతర ప్రయోజనాలు దాని కిందకే వస్తాయి’ అని పేర్కొంది. అయితే ఎంపీల పదవీ కాలం ముగిసినప్పటికీ వారు గౌరవ ప్రదంగా ఉండేందుకు పెన్షన్లు, ఇతర అలవెన్స్‌లు, సేవలు అందించడం సబబేనని విచారణ సందర్భంగా కేంద్రం చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment