గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ మంజూరుకు అభ్యంతరం లేదని సీబీఐ పేర్కొనడంతో ధర్మాసనం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఓఎంసీ కేసులో 2011 సెప్టెంబర్ 5న జనార్దన్‌రెడ్డి అరెస్టయ్యారు.
అప్పట్నుంచీ జైల్లోనే ఉన్నారు. మంగళవారం కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే... ‘దర్యాప్తు పూర్తయిందా? ఇంకా చార్జిషీట్లు ఏమైనా ఉన్నాయా?’ అని ధర్మాసనం సీబీఐ న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్‌సింగ్‌ను ప్రశ్నించింది. ‘అఫిడవిట్ దాఖలు చేశాం. చార్జిషీట్లు పూర్తయ్యాయి. షరతులతో కూడిన బెయిల్ మంజూరుకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఆయన తెలిపారు. జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ..‘41 నెలలుగా జైలులోనే ఉన్నారు. సీబీఐ చెప్పినట్టు షరతులతో కూడిన బెయిల్‌కు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని పేర్కొన్నారు. దీంతో ఐదు షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు జస్టిస్ దత్తు చెప్పారు.
ఒక్కో చార్జిషీటుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల పూచీకత్తు చెల్లించాలని, పాస్‌పోర్టును సీబీఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, అనంతపురం, కడప, బళ్లారికి వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఐదు షరతులు విధించారు. ఇప్పటి వరకు 4 కేసుల్లో ఏడు చార్జిషీట్లను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డికి అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నారు. బెయిల్ పత్రాలు తొలుత హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు పరిచిన అనంతరం పరప్పన జైలుకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు 3,4 రోజుల సమయం పడుతుందని జనార్దన్‌రెడ్డి న్యాయవాది హనుమంతరాయ బెంగళూరులో చెప్పారు. ఆయన జైలు నుంచి బయటకు విడుదలయ్యే రోజున జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కాగా, బెయిల్ సంగతి తెలియగానే బళ్లారి, బెంగళూరులో గాలి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
అరెస్ట్ నుంచి బెయిల్ దాకా..
2011 సెప్టెంబర్ 5న గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్‌కు తరలించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచింది. సెప్టెంబర్ 13న వీరిని కోర్టు 6 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మరోసారి కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ పిటిషన్‌ను సెప్టెంబర్ 30న కొట్టివేసింది. 2011 డిసెంబర్ 3న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 3 సంవత్సరాల 4 నెలలకుపైగా జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌లు రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసు తర్వాత కర్ణాటకలో మైనింగ్‌పై సీబీఐ మరో రెండు కేసులు పెట్టింది. తర్వాత బెయిల్ కోసం న్యాయమూర్తిని ప్రలోభ పెట్టారంటూ ఏపీ ఏసీబీ మరో రెండు కేసులు నమోదు చేసింది. వీటన్నింటిలో గాలికి కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది.