
సాక్షి, న్యూఢిల్లీ: గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పలు కేసుల్లో తన బెయిలు మంజూరుకు విధించిన షరతులను సడలించాలని కోరుతూ సోమవారం ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.
అనంతపురం, బళ్లారి ప్రాంతాలకు రాకూడదని, విదేశాలకు వెళ్లకూడదని ఆయనను ఆదేశిస్తూ గతంలో బెయిల్ సమయంలో కోర్టు షరతులు విధించడం తెలిసిందే. స్వస్థలం వెళ్లేందుకు అనువుగా బెయిల్ షరతులను సడలించాలని తాజా పిటిషన్‌లో జనార్దన్‌రెడ్డి కోరారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని బెంచ్ పిటిషన్‌ను విచారించి షరతుల సడలింపు కుదరదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. ప్రధాన కేసులో చార్జిషీటు దాఖలైన తర్వాత బెయిల్ షరతుల అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.