సాక్షి, న్యూఢిల్లీ : ముళ్లపెరియార్ డ్యామ్‌లో ఈనెల 31 వరకూ నీటిమట్టాన్ని 139 అడుగులు నిర్వహించాలని సుప్రీం కోర్టు తమిళనాడును ఆదేశించింది. కేరళ వరదలను దృష్టిలో ఉంచుకుని సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు, కేరళ పరస్పర సహకారంతో ప్యానెల్ ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించింది.
ముళ్లపెరియార్ డ్యామ్ సబ్‌కమిటీ ఈనెల 23న భేటీ అయిన సందర్భంగా సుప్రీం కోర్టు అనుమతించిన పరిమితికి రెండు అడుగులు తక్కువగా 139 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిందని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది.
ముళ్లపెరియార్ డ్యామ్ నుంచి తమిళనాడు ఒక్కసారిగా నీటిని విడుదల చేయడం వల్లే వరదలు సంభవించాయని కేరళ సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా కేరళలోని ఇడుక్కి జిల్లా తెక్కడి వద్దనున్న ముళ్లపెరియార్ డ్యామ్‌ను తమిళనాడు నిర్వహిస్తోంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment