జల జంజాటం! | Tamilnadu Fight For Cauvery Management Board | Sakshi
Sakshi News home page

జల జంజాటం!

Published Wed, Apr 11 2018 12:34 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

Tamilnadu Fight For Cauvery Management Board - Sakshi

పట్టించుకోనట్టు నటిస్తే... భారాన్ని న్యాయస్థానాలపైకి నెట్టేస్తే గండం గట్టెక్కుతా మని భావించే పాలకులకు కావేరీ నదీజలాల విషయంలో సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలు చెంపపెట్టు. కావేరీ వివాదంపై ఫిబ్రవరి 16న వెలువరించిన తీర్పులో ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీరు అందవలసి ఉంటుందో సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఈ తీర్పు అమలుకు అవసరమైన విధివిధానాలను ఆరు వారాల్లో రూపొందించాలని, ఈ నదీజలాలను వినియోగించుకునే నాలుగు రాష్ట్రాల్లోని సాంకేతిక నిపుణులతో కావేరీ యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దాని ప్రకారం ఏప్రిల్‌ మొదటి వారానికల్లా ఇవి అమలు కావాలి. కానీ అది జరగకపోవడంతో కేంద్రం కోర్టు ధిక్కారానికి పాల్ప డిందని తమిళనాడు ప్రభుత్వం ఫిర్యాదుచేస్తే... గడువును మార్చాలంటూ కేంద్రం కోరింది. మార్చి 31న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటాన్ని అందుకు కారణంగా చూపింది. నదీ జలాల వివాదం భావోద్వేగాలతో కూడుకున్న అంశం గనుక శాంతిభద్రతల సమస్య తలెత్తి ఎన్నికలకు ఆటంకం కలిగే ప్రమా దమున్నదని చెప్పింది. కానీ ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. విధివిధా నాల ఖరారుపై శ్రద్ధ చూపకపోవడాన్ని తప్పుబట్టి ‘అసలు జల వివాదాల పరిష్కా రంపై మీకు ఆసక్తి ఉందా లేదా’ అని నిలదీసింది. వచ్చే నెల 3 లోపు ఆ ఆదేశాన్ని అమలు చేసి తీరాలని హెచ్చరించింది. 

ఈ విషయంలో ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. కేంద్రంలో ఎవరున్నా నదీ జలాల విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నారు. రుతుపవనాలు కరుణించి పుష్కలంగా వర్షాలు పడితే కావేరీ నది విషయంలో మాత్రమే కాదు... ఏ నది విషయంలోనూ వివాదాలుండవు. కానీ రుతుపవనాలు ముఖం చాటేసినప్పుడు నదీ పరీవాహ ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతుంది. అప్పు డిక ఉద్రేకాలు పెరుగుతాయి. ఆందోళనలు మొదలవుతాయి. మా గొంతు తడవటం లేదని ఒకరంటే, మా పొలాలు ఎండిపోతున్నాయని మరొకరంటారు. దశాబ్దాలుగా ఇదే సాగుతోంది. కేంద్రంలో ఉండే పాలకులు రాజకీయ ప్రయోజనాలనాశించి ఆలో చించడం వల్ల సమస్య ఎప్పటికీ సమస్యగానే మిగులుతోంది. ‘ఎంతకాలం దీన్ని సాగ దీస్తారు... తక్షణం కావేరీ నదీజలాల ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయండ’ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప 1990లో అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం చొరవ ప్రదర్శించలేదు.

 ఏడాది తర్వాత ఆ ట్రిబ్యునల్‌ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలతో కర్ణాటక రణక్షేత్రంగా మారింది. ఆ రాష్ట్రంలోని తమిళులు ప్రాణ భయంతో స్వరాష్ట్రానికెళ్లి పోవాల్సివచ్చింది. దానికి పోటీగా తమిళనాడులోనూ నిరసనలు మిన్నంటాయి. ఆ తర్వాత వర్షాలు సక్రమంగా పడటంతో మరో అయిదేళ్ల వరకూ అంతా బాగానే ఉంది. కానీ 1995లో మరోసారి కరువు పరిస్థితులు ఏర్పడటంతో పోటాపోటీ ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత మరో అయి దారేళ్లకు మళ్లీ ఇదే పునరావృతం అయింది. అంతా బాగున్న సమయంలో అన్ని రాష్ట్రాలనూ సమావేశపరిచి, నిపుణుల సాయం తీసుకుని ఒక పరి ష్కార మార్గం కనుగొనడానికి కావలసినంత వ్యవధి ఉంటుంది. భావోద్వేగాలు లేన ప్పుడు అన్ని పక్షాలనూ ఒప్పించడం సులభం. కానీ సమస్య పీకల మీదికొచ్చిప్పుడు ప్రభుత్వాలు ఏదో చేసినట్టు నటిస్తున్నాయి. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని వ్యవ హరిస్తున్నాయి. ఫలితంగా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా లేనిపోని వైషమ్యాలు పెరుగు తున్నాయి. 

వారం రోజులుగా తమిళనాడు అట్టుడుకుతోంది. సుప్రీంకోర్టు తీర్పునకు అను గుణంగా చర్యలు తీసుకోవాలని దాదాపు అన్ని ప్రాంతాల్లో ధర్నాలు జరుగు తున్నాయి. చెన్నైలో మంగళవారం ప్రారంభమైన ఐపీఎల్‌ మ్యాచ్‌ను అడ్డుకునేం దుకు జనం వీధుల్లోకొచ్చారు. పోలీసులు అనేకచోట్ల లాఠీచార్జి చేశారు. నిరసనలో పాలుపంచుకుంటున్న సినీ రంగ ప్రముఖులతోసహా 3,500మందిని అరెస్టు చేశారు. నిజానికి ఈ సమస్య కేవలం కర్ణాటక, తమిళనాడులది మాత్రమే కాదు... ఇందులో కేరళ, పుదుచ్చేరి కూడా ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలూ ఎవరెంత నీటిని వాడుకోవాలో 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ (సీడబ్ల్యూడీటీ) తీర్పు చెప్పింది. అయితే తమకు అన్యాయం జరిగిందంటూ అన్ని పక్షాలూ సుప్రీం కోర్టు తలుపు తట్టాయి. పర్యవసానంగా సుప్రీంకోర్టు ఆ ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో ఫిబ్రవరి 16న స్వల్పంగా మార్పులు చేసింది. తుది తీర్పు ప్రకారం తమిళనాడుకు 404.25 టీఎంసీలు(ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో 14.75 టీఎంసీల కోత), కర్ణాటకకు 284.75 టీఎంసీలు (అంతక్రితంకంటే 14.75 టీఎంసీలు అధికం) కేటాయించింది. కేరళకు కేటాయించిన 30 టీఎంసీలు, పుదుచ్చేరికిచ్చిన 7 టీఎంసీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ కేటాయింపులు 15 ఏళ్ల వరకూ కొనసాగుతాయని చెప్పింది. 

ప్రస్తుతం కర్ణాటకలో కావేరీ పరీవాహ ప్రాంతంలో కృష్ణరాజసాగర్, హరంగి, హేమవతి, కబిని జలాశయాలున్నాయి. వీటి పరిధిలో వ్యవసాయాన్ని కర్ణాటక విస్తరిస్తున్నకొద్దీ ఆ మేరకు తమిళనాడులోని రైతులకు నీటి లభ్యత తగ్గిపోతోంది. ఇక వర్షాభావ పరిస్థితులుంటే వారి సమస్య మరింత పెరుగుతుంది. ఒక్క కావేరీ విషయంలో మాత్రమే కాదు... దాదాపు అన్ని నదీ పరివాహ ప్రాంతాల్లోనూ ఎగువ రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై దిగువ రాష్ట్రాలు ఆధారపడాల్సి వస్తోంది. వరదలొ చ్చిప్పుడు ఎనలేని నష్టం చవిచూడటం... వానలు పడనప్పుడు ఎగువ రాష్ట్రాలను ప్రాధేయపడటం, గొడవపడటం దిగువ రాష్ట్రాలకు తప్పడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు నదుల్ని జాతీయ ఆస్తులుగా పరిగణించి పరీవాహ ప్రాంతాల్లోని రాష్ట్రా లన్నీ తమ అవసరాలతోపాటు వేరే రాష్ట్రం సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకుని హేతుబద్ధంగా వ్యవహరిస్తే జల వివాదాలుండవు. మౌలికంగా జల వివాదాలు రాజకీయపరమైనవి. వాటిని పరిష్కరించే బాధ్యతను రాజకీయ నాయకత్వమే తీసుకోవాలి. అన్ని పక్షాలకూ నచ్చజెప్పాలి. న్యాయస్థానాలకొదిలి, ఏళ్ల తరబడి నాన్చితే అవి ఉన్నకొద్దీ జటిలంగా మారి కొరకరాని కొయ్యలవుతాయి. ప్రజల మధ్య çసుహృద్భావ వాతావరణం దెబ్బతింటుంది. కేంద్రం వీటిని దృష్టిలో ఉంచు కుని జాగ్రత్తగా అడుగులేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement