న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోన్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై అభ్యంతరాల్ని విస్తృత ధర్మాసనం చర్చించాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కంలో పాల్గొనే వయోధికుల్ని శిక్షించేందుకు అనుమతిస్తున్న సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
అసహజ నేరాల్ని పేర్కొంటున్న సెక్షన్ 377 ప్రకారం ‘ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా లైంగిక చర్యకు పాల్పడితే వారు శిక్షార్హులు. నేరం రుజువైతే వారికి జీవిత ఖైదు, జరిమానాతో పాటు అవసరమైతే శిక్షను గరిష్టంగా పదేళ్ల వరకూ పొడిగించవచ్చు.’ ఐపీసీ 377 సెక్షన్‌ను సవాలు చేస్తూ నవ్‌తేజ్ సింగ్ జోహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ‘377 సెక్షన్‌ను సమర్ధిస్తూ 2013 నాటి సుప్రీం తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌ను అదే ధర్మాసనం విచారిస్తుంది’ అని స్పష్టం చేసింది.
జోహర్ తరఫున సీనియర్ న్యాయవాది అర్వింద్ దతర్ వాదిస్తూ.. ఈ నేర నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, పరస్పర అంగీకారంతో వయోధికులు స్వలింగ సంపర్కంలో పాల్గొంటే వారిని నేరస్తులుగా పరిగణించడంతో పాటు జైలు శిక్ష విధించేందుకు ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత గోప్యత అంశంపై ఇటీవల బెంచ్ ఇచ్చిన తీర్పును దతర్ ఉటంకించారు. ‘లైంగిక భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రాథమిక హక్కే’నన్న కోర్టు గత తీర్పుతో పాటు, 2009లో నాజ్ ఫౌండేషన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన సభ్యులు వేసిన∙పిటిషన్ కాపీని న్యాయశాఖకు అందచేయాలని కోర్టు సూచించింది.
1861నుంచి నేరంగా...
ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈతీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రా న్ని సుప్రీం ఆదేశించింది.
డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదంది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయి.
ఒకరికి సహజం.. మరొకరికి కాదు: కోర్టు
‘ప్రకృతి నియమాలు స్థిరంగా ఉండవు. సామాజిక నైతిక విలువలు మారుతాయి. ఒకరికి సహజం అనిపించేది మరొకరికి కాకపోవచ్చు. ఒక వర్గం ప్రజలు లేక వ్యక్తులు తమ స్వేచ్ఛను ఎన్నుకునే క్రమంలో ఎప్పుడూ భయంతో కూడిన స్థితిలో ఉండకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తికి సంక్రమించే హక్కుల్లో చట్టపరంగా ఉన్న పరిధులు జోక్యం చేసుకోలేవు. రాజ్యాంగ పరిమితులకు లోబడి చట్టం వ్యవహరించాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment