
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని స్పష్టం చేసింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎప్పట్లోగా మార్గదర్శకాలను రూపొందిస్తారో మూడు వారాల్లోగా సుప్రీంకోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో వినియోగదారుల అకౌంట్లకు ఆధార్ లింకప్‌కు సంబంధించి వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదలాయించాలన్న పిటిషన్‌పై విచారణ జరిపే సమయంలో న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో వచ్చే నకిలీ వార్తలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోలేకపోతున్నారని బెంచ్ పేర్కొంది.
‘స్మార్ట్‌ఫోన్ వాడను’
సోషల్ మీడియా విస్తృతి పెరగడం, ఇంటర్నెట్ నెట్టింట్లోకి రావడంతో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం హద్దులు దాటిపోయి ఎంతటి ప్రమాదకారిగా మారుతోందో అర్థమవుతుంటే స్మార్ట్ ఫోన్ వాడటం ఆపేసి, బేసిక్ ఫోన్‌కు మారాలని ఉందని జడ్జి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment