![రాజకీయాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51481274957_625x300.jpg.webp?itok=omaDSoig)
రాజకీయాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: కులమతాల పేరుతో ప్రజలను విభజిస్తున్న రాజకీయ నాయకులకు చెంపపెట్టు లాంటి తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. విభజన రాజకీయాలు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయనాయలెవరూ కులం, మతం పేరుతో ఓట్లు అడగరాదని ఆదేశించింది. హిందూత్వ కేసులో దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకుర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మానం ఈ మేరకు చారిత్రక తీర్పు చెప్పింది.
ఎన్నికలనేవి లౌకిక విధానంలో భాగమని... కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని ఆకాంక్షించింది. భగవంతుడికి, మనిషికి మధ్య సంబంధం వ్యక్తిగతమని.. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. రెండు దశాబ్దాల నాడు ఇచ్చిన 'హిందూత్వ'తీర్పును పునఃసమీక్షించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మానం సవివర తీర్పునిచ్చింది. ఎన్నికల్లో లబ్ధికి మతాన్ని దుర్వినియోగం చేయడం అవినీతి కిందకే వస్తుందని పేర్కొంటున్న ఎన్నికల చట్టంలోని ఒక సెక్షన్ ను సర్వోన్నత న్యాయస్థానం ఉటంకించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డె, జస్టిస్ ఎ.కె.గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు.
కేసు నేపథ్యం
హిందూత్వ కేసులో తీర్పును 1995లో అప్పటి సీజే జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఓట్లు అడినందునశివసేన నేత మనోహర్ జోషితో పాటు బీజేపీ, శివసేనకు చెందిన మరికొందరి ఎన్నిక చెల్లదని బొంబాయి హైకోర్టు 1991లో ఇచ్చిన తీర్పును జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. హిందూత్వ/హిందూయిజం అన్నది ఉపఖండంలో ప్రజల జీవన విధానమని.. అదొక మనఃస్థితి అని మతం కాదని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూత్వ పేరుతో ఓట్లు కోరడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం కాదని క్లారిటీ ఇచ్చింది.
ఈ తీర్పు వెలువడిన ఏడాది తర్వాత ఇటువంటి కేసునే విచారించిన మరొక త్రిసభ్య ధర్మాసనం.. జస్టిస్ వర్మ తీర్పుతో విభేదించింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ పునఃసమీక్షించాలని సూచించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ కేసును విచారిస్తుండగా బీజేపీ నేత సందర్‌లాల్ పట్వా ఎన్నిక చెల్లదంటూ నారాయణసింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన కేసు 2002లో వచ్చింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123కు భాష్యం చెబుతూ సవివర తీర్పు వెలువరించేందుకు ఈ కేసు మొత్తాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు.