అవగాహన లేక అరెస్టుల పర్వం!
సుప్రీంకోర్టు కొట్టివేసిన కొన్ని సైబర్ చట్టాలపై అవగాహనా రాహిత్యంతో ఎంతో మంది జైలు పాలవుతున్నారు. ఈ కారణంగా మూడు వేలకు పైగా అరెస్టులు జరిగి ఆయా కేసుల్లో పలు కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ చట్టాల్లో సెక్షన్ 66ఏ పై పలుమార్లు అభ్యంతరాలు, పిటిషన్లు వస్తున్న వాటిని పరిశీలించిన అనంతరం గతేడాది మార్చి నెలలో ఈ చట్టాన్ని సీరియస్ గా తీసుకోవద్దని సూచించింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో భాగంగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి. అయితే తప్పుడు సంకేతాలు ఇస్తున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటే మంచిదని సుప్రీంకోర్లు ఈ సెక్షన్ పై స్పష్టతనిచ్చింది.
అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేస్తే వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కానీ, అదే సమయంలో కొన్నిసార్లు భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూడాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజగా వెల్లడించిన నివేదిక ప్రకారం 2015లో 3,137 మంది అరెస్ట్ కాగా, 2014లో 2,423 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడైంది.
2015లో ప్రతి 12 గంటలకు నలుగురు వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారని తేలింది. ఈ జనవరి నుంచి ఇప్పటివరకూ సైబర్ సెక్షన్ కింద 575 మంది జైళ్లలో గడుపుతున్నారు. ఈ సెక్షన్ కింద ఇంకా అరెస్టులు జరుగుతుండటంపై ఆశ్చర్యానికి లోనైనట్లు సుప్రీంకోర్టు లాయర్ కరుణ తెలిపారు. ఈ చట్టాన్ని తొలగించాలని కోరుతున్న పిటిషనర్లలో ఆమె కూడా ఒకరు.