రైలు ప్రమాదంపై సురేష్ ప్రభు ఆరా
విజయనగరం : హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో సహాయకచర్యలు ముమ్మరం చేయాలని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఆయన ఆరా తీశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లకు బాబు ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర మంత్రులు ఘటనాస్థలానికి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
ప్రమాద ఘటనపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడామని.. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మెడికల్ టీమ్స్‌ను రంగంలోకి దించామన్నారు. పార్వతీపురం నుంచి 30, విజయనగరం నుంచి 7 వైద్య బృందాలతో సహా మొత్తం 37 వైద్య బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల్లో పాల్గొన్నాయన్నారు. విశాఖ కేజీహెచ్‌లో క్షతగాత్రులకు జాప్యం లేకుండా వైద్యం అందిస్తున్నామని కామినేని చెప్పారు.