న్యూఢిల్లీ: ప్రచండ తుపాను పై-లీన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌సేత్ శనివారం పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వారి సన్నద్ధతను పర్యవేక్షించారు. ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన సహాయక చర్యలు, తుపాను తీరం దాటిన తర్వాత సాధారణ పరిస్థితులు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో శాఖల వారీగా బాధ్యతలను నిర్దేశించారు. హోం, రక్షణ, పెట్రోలియం, టెలికం, ఆరోగ్య, ఆహార, రైల్వే, తాగునీరు సహా పలు శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. శాఖల మ ధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఈ భేటీలో తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తుపాను తీరం దాటిన తర్వాత ఇంధన కొరత లేకుండా చూసేందుకు, సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు టెలికం, పెట్రోలియం శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేశాయని వెల్లడించాయి. మూడు రోజులకు సరిపడా ఇంధనం, వంటగ్యాస్‌ను అందుబాటులో ఉంచారు. విద్యుత్ వ్యవస్థకు విఘాతం కలిగితే, రైళ్లను నడిపేందుకు డీజిల్ ఇంజిన్లను రైల్వే శాఖ సిద్ధంగా ఉంచింది. కనీస నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు కూడా తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందించేందుకు వైద్య బృందాలను రంగంలోకి దింపినట్లు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కూడా సహాయక కార్యక్రమాల కోసం పరికరాలతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి. 1990 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక స్థాయిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇదే మొదటిసారని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
పై-లీన్‌పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షణ
Published Sun, Oct 13 2013 3:15 AM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM
Advertisement