స్మృతికి షాకిచ్చిన సర్వే ఫలితాలు!
న్యూఢిల్లీః ప్రముఖులను, పెద్దలను గౌరవించడం.. ఇరర వ్యక్తులకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ముఖ్యంగా భారతదేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. ఇటీవల బిహార్ విద్యామంత్రి అశోక్ చౌదరి.. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీని డియర్ అంటూ సంబోధించడం ట్విట్టర్లో వివాదం రేపింది. దీంతో డియర్ వాడొచ్చా లేదా అన్న విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ సర్వే చేసింది. ఎంతమందిని సర్వే చేశామన్న విషయం వాళ్లు చెప్పలేదు గానీ.. ఎక్కువ శాతం మంది 'డియర్' అనొచ్చనే చెప్పారన్నారు.
ఇటీవల బిహార్ లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై, ఆ రాష్ట్ర విద్యామంత్రి చౌదరి ట్విట్టర్ లో ''డియర్ స్మృతి ఇరానీ గారూ... మీరు రాజకీయ ప్రసంగాలపై కాకుండా నూతన విద్యావిధానంపై దృష్టిసారిస్తే బాగుంటుంది'' అంటూ రాయడంతో వివాదం తలెత్తింది. చౌదరి కామెంట్ కు స్పందించిన స్మృతి ఇరానీ.. మీరు మహిళలను ఇలా డియర్ అంటూ సంబోధించడం ఎప్పుడు మొదలుపెట్టారంటూ అడిగారు. దీంతో ప్రొఫెషనల్ ఈ మెయిల్స్ పంపేటప్పుడు డియర్ అని రాస్తారు, నేనన్నది తప్పేమీ కాదంటూ చౌదరి సమర్థించుకున్నారు.
మహిళలను డియర్ అని పిలవడం సెక్సిస్ట్ రిమార్క్ అవుతుందా అని, కొత్తగా మహిళలకు లేఖ రాయాల్సినపుడు ఎలా సంబోధిస్తే బాగుంటుంది? ఎలా ముగిస్తే బాగుంటుంది? అంటూ మూడు ప్రశ్నలు సర్వేలో భాగంగా జాతీయ మీడియా సంస్థ సంధించింది. అనంతరం మీడియా సంస్థకు వచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. సెక్సిస్ట్ రిమార్క్ అవుతుందా అన్న ప్రశ్నకు అవును అన్నసమాధానం 18 శాతం మంది నుంచి వస్తే, 82 శాతం మంది కాదు అనడం విశేషం. అలాగే లేఖ రాసేప్పుడు డియర్ అంటూ సంబోధించడాన్ని 35 శాతం మంది సమర్థించగా, 31 శాతం మంది హాయ్ అంటే బాగుంటుందని, 30 శాతం మంది హల్లో అంటే బాగుంటుందని సమాధానం ఇచ్చారు. ముగింపులో రిగార్డ్స్ అనాలని 69 శాతం మంది, యువర్స్ సిన్సియర్లీ లేదా ఫెయిత్ ఫుల్లీ అనాలని 16శాతం మంది, ఆల్ ది బెస్ట్, ఛీర్స్ అంటే బాగుంటుందని 15 శాతం మంది సూచించారు.