
సాక్షి, న్యూఢిల్లీ : నిరుద్యోగం, ధరల పెరుగుదలే దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలని తాజా సర్వే వెల్లడించింది. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవడంతో పాటు దేశంలోని ప్రధాన సమస్యలను మోదీ సర్కార్ డీల్ చేసే తీరుపై ప్రజల్లో నిరాశే నెలకొందని అమెరికాకు చెందిన పీఈడబ్ల్యూ రీసెర్చి సెంటర్ ఇటీవల ప్రచురించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను గత ఏడాది మే-జులైలో నిర్వహించగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో సర్వేను ప్రచురించారు. భారత ఓటర్లను అధికంగా ఆందోళనకు గురిచేస్తున్నదని నిరుద్యోగం, ధరల పెరుగుదలేనని ఈ సర్వే తేల్చింది.
అధికారుల్లో పేరుకుపోయిన అవినీతి, ఉగ్రవాదం, నేరాలు సైతం భారత ఓటర్లను కలవరపెడుతున్నాయని పేర్కొంది. పది ఆందోళన కలిగించే అంశాల్లో పారిశ్రామికవేత్తల్లో అవినీతి, వాయుకాలుష్యం కూడా చోటుచేసుకున్నాయి. రెండోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుందని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా మోదీ హయాంలో నిరుద్యోగ భారతంలో ఎలాంటి మార్పు లేకపోవడం, కొత్త కొలువులు పెద్దగా రాకపోవడం పట్ల యువత ఆగ్రహంగా ఉన్నట్టు సర్వే నివేదిక పెదవివిరిచింది.
ఇక ధరల పెరుగుదలతో జీవితం దుర్భరంగా మారిందని సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది ఆందోళన వ్యక్తం చేయగా, అవినీతి పెరిగిందని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉగ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొంటున్నామని మోదీ సర్కార్ చాటిచెబుతుండగా, ఉగ్రవాదం మరింత పెచ్చుమీరిందని 59 శాతం మంది చెప్పుకొచ్చారు. ఉగ‍్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటున్నారని కేవలం 21 శాతం మందే అభిప్రాయపడ్డారు. కాగా, భారత్‌లో 20 ఏళ్ల కిందటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం సగటు జీవి ఆర్థిక పరిస్థితి మెరుగైందని 65 శాతం మంది చెప్పడం గమనార్హం.
ఆర్థికంగా సగటు జీవి చితికిపోయాడని కేవలం 15 శాతం మందే వెల్లడించారు. ఇక భారత్‌లో ప్రజాస్వామ్యం పనితీరుపై 54 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే 2017లో 79 శాతం మంది ప్రజాస్వామ్య తీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా, ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment