
ఆమె ప్రసంగం భారత ప్రతిష్టను ఇనుమడించేలా లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సాధారణ సమితిలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పెదవివిరిచారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచేలా ఆమె ప్రసంగం నిర్మాణాత్మకంగా సాగలేదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటర్లను ఆకర్షించేలా కేవలం పాకిస్తాన్ అంశంపైనే సుష్మా ప్రసంగం మొక్కుబడిగా ఉందని ఆరోపించారు.
ఐరాస సమగ్ర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను 73వ ఐరాస సాధారణ సమితి సమావేశంలో ఆమె సోదాహరణంగా వివరించారు. కాగా ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఆసియా ఉపఖండంలో ఉగ్రవాద నిరోధానికి పాకిస్తాన్ చేసిందేమీ లేదని సుష్మా సమర్ధంగా చాటిచెప్పారని జైట్లీ ట్వీట్ చేశారు. ఉగ్రవాదంపై పాకిస్ధాన్ ద్వంద్వ వైఖరిని ఆమె సమర్ధంగా ఎండగట్టారన్నారు.