పోలీస్ రిక్రూట్మెంట్కు డ్రగ్స్తో..!
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షలలో అభ్యర్థులు సులభమైనదారులను అన్వేషిస్తూ మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. కురుక్షేత్రలో నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్ట్లో వారం రోజుల వ్యవధిలో ఇరవై ఏళ్ల యువకులు ముగ్గురు మృతిచెందారు. వీరంతా మోతాదుకు మించి ఉత్ప్రేరకాలు తీసుకోవటం వలనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరో 400 మంది యువకులు సైతం ఫిజికల్ టెస్ట్ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది.
కురుక్షేత్ర సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్కే నైన్ మాట్లాడుతూ.. చాలా మంది విద్యార్థులు ఫిజకల్ టెస్ట్ సమయంలో మూర్చతో పడిపోయారు. చనిపోయిన విద్యార్థులు డ్రగ్స్ ఓవర్డోస్ మూలంగానే మృతిచెందారనే అనుమానాలున్నాయి. దీనికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది' అని తెలిపారు. రన్నింగ్, ఇతర ఫిజికల్ టెస్ట్లలో అర్హత సాధించేందుకు అభ్యర్థులు కొన్ని నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నా.. కొందరు మాత్రం అలా చేయకుండా ఎలాగైనా పాస్ కావాలి అనే ఉద్దేశంతో ఉత్ప్రేరకాలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇవ్వాల్సిన కొన్ని మందులను సైతం అభ్యర్థులు ఈజీగా మార్కెట్లో పొందుతున్నారనే విమర్శలున్నాయి.