శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పాకిస్తాన్‌కే చెందుతుందని, భారత్–పాక్ మధ్య దీని కోసం ఎన్ని యుద్ధాలు జరిగినా పరిస్థితిలో మార్పు ఉండబోదని కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన భారత్, చైనా, పాక్ మధ్య కశ్మీర్ ఉందని, స్వతంత్ర కశ్మీర్ గురించి చర్చ అనవసరమన్నారు. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాని ఖకాన్ అబ్బాసీ స్వతంత్ర కశ్మీర్ ఆలోచనను తిరస్కరించారు. వాస్తవంలో ఇది సాధ్యంకాదన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఫరూఖ్ తాజా కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. ‘ ఆజాదీ(స్వతంత్ర కశ్మీర్) గురించి చర్చ అనవసరం. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్, ఇంకోవైపు భారత్.. ఇలా మూడు దేశాల మధ్య మేము ఉన్నాం.
ఈ మూడు దేశాలకు అణ్వాయుధ సామర్థ్యం ఉంది. అందువల్ల అల్లా పేరు తప్ప ఇంక దేని గురించీ ఆశించరాదు’’ అని అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజాదీ గురించి వేర్పాటువాదులు మాట్లాడటం తప్పు అని పేర్కొన్నారు. అంతర్గత స్వయంప్రతిపత్తి తమ హక్కని, కేంద్రం దానిని పునరుద్ధరించాలని, అప్పుడే కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని చెప్పారు. పీవోకే భారత్‌కే చెందుతుందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ చేసిన వ్యాఖ్యలను అబ్దుల్లా తప్పుపట్టారు. భారత ప్రభుత్వం, మహారాజ్ హరిసింగ్ మధ్య జరిగిన విలీన ఒప్పందాన్ని మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. దాని ప్రకారం పీవోకే పాక్ చెందుతుందని, ఒకవేళ అది మనకే చెందుతుందని చెపితే.. విలీన నిబంధనలపైనా మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment