
చౌకగా ఇంటర్నెట్
ప్రపంచం మొత్తాన్ని ప్రజల ముంగిటకు చేర్చే ఇంటర్నెట్ సేవలను అరసు బ్రాడ్‌బాండ్ వినియోగం ద్వారా చౌకగా పొందే ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. రూ.70కే ప్రసారం చేస్తున్న అరసు కేబుల్ ద్వారానే ఇంటర్నెట్ అందించనున్నట్లు తెలిపారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రపంచం మొత్తాన్ని ప్రజల ముంగిటకు చేర్చే ఇంటర్నెట్ సేవలను అరసు బ్రాడ్‌బాండ్ వినియోగం ద్వారా పొందే ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. సోమవారం ఆమె అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, రూ.70లకే అరసు కేబుల్ ద్వారా వినోద, విజ్ఞాన ప్రధానమైన టీవీ చానెళ్లను ప్రసారం చేస్తున్నామని తెలిపారు. ఇందులోనే ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టబోతున్నామని అన్నారు. అత్యంత చౌకధరకు హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ సౌకర్యాన్ని పొందవచ్చని ఆమె తెలిపారు. అటవీశాఖలోని 650 ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా వృక్ష సంపదను పెంచ వచ్చని చెప్పారు.
ఆదాయపు పన్ను సేవలను గ్రామాలకు విస్తరించడం ద్వారా ప్రజల రవాణా వ్యయాన్ని తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 15 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తిరువళ్లూరు, కాంచీపురం, విళుపురం, కడలూరు, సేలం, నామక్కల్, తిరువన్నామలై, పుదుక్కోట్టై, శివగంగై, రామనాధపురం, విరుదునగర్ తిరునెల్వేలీ తదితర జిల్లాలను ఇందుకు అనుగుణంగా పునర్విభజిస్తున్నటు తెలిపారు. తేనిలో రూ.14 కోట్లతో 200 ఖైదీలను ఉంచగల జిల్లా జైలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
తేని కోర్టులో హాజరుపరిచిన వారిని ప్రస్తుతం మదురై జిల్లా కోర్టుకు తరలిస్తున్నారని, ఇకపై ఆ అవసరం ఉండదన్నారు. నామక్కల్, ఈరోడ్డు, సేలం, కరూరులో విస్తరించి ఉన్న అద్దకం పరిశ్రమను తిరుపూరులో కేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రీకరణ వల్ల లక్షమందికి అదనంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సాధించేందుకు రూ.110 కోట్లు వెచిస్తున్నామని రైతులకు వడ్డీలేని రుణాలను మంజూరు చేయనున్నామని ఆమె అన్నారు.