దద్దరిల్లిన సభ
అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడివేడిగా సాగాయి. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, అరుపులు, కేకలతో అసెంబ్లీ దద్దరిల్లి పోయింది. మంత్రి వైద్యలింగం మాటలు పెద్ద దుమారం రేపాయి. తమను అవమానానికి గురిచేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడివేడిగా జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే తన రాజకీయ గురువు, విజేతలకు విజేతైన కెప్టెన్‌కు నమస్కరిస్తూ డీఎండీకే సభ్యులు వెంకటేశన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇందుకు మంత్రి వైద్యలింగం అడ్డుతగిలారు. ఎక్కడ విజేత, గత పార్లమెంటు ఎన్నికల్లోనా, మూడో స్థానానికి దిగజారడంలోనా, డిపాజిట్ కోల్పోవడంలోనా.. అంటూ చురకలు అంటించారు. ఆగ్రహించిన వెంకటేశన్ మంత్రి వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. అయితే సభలోనే ఉన్న సీఎం జయలలిత, స్పీకర్ పట్టించుకోకపోవడం గమనార్హం.
రాబోయే ఎన్నికల్లో డీఎండీకే ఒంటరిగా పోటీచేసే దమ్ముందా అంటూ మంత్రి సవాల్ విసిరారు. ఒంటరిపోరుతో మీకు కనీసం వెయ్యి ఓట్లు కూడా రావు అంటూ ఎద్దేవా చేశారు. సవాల్‌కు బదులివ్వకుండా ఇతర వాటిపై దృష్టి సారించారంటూ మంత్రి పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు. ఎంజీ రామచంద్రన్ మినహా ఎవ్వరూ ఈ రాష్ట్రాన్ని వరుసగా పాలించలేదని, ఈ విషయం గుర్తించుకోండి అంటూ ఆయన బదులిచ్చారు.
మౌళివాక్కం ప్రమాదంపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశామని, ఈ రోజైనా ఇవ్వాలని డీఎండీకే సభ్యులు దురైమురుగన్ కోరారు. ప్రమాదంతో సీఎండీఏకు సంబంధం లేదని మంత్రి ప్రకటించారు. అంతమాత్రానికి సీఎండీఏకు ఒక మంత్రి ఎందుకని దురైమురుగన్ నిలదీశారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ నిరాకరించడంతో ప్రతిపక్షాలతో కలిసి వాకౌట్‌కు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో మంత్రి వైద్యలింగం ఁలేచి పోయే అలవాటు ఉన్నవారు లేచిపోతున్నారు* అంటూ ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల పట్ల అవమానకరంగా మాట్లాడుతున్నా సభలోనే ఉన్న సీఎం మందలించాల్సింది పోయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారని, స్పీకర్ సైతం ఆ మాటలను తొలగించేందుకు వీలులేదని స్పష్టం చేశారని వాకౌట్ చేసిన అనంతరం మీడియా వద్ద ప్రతిపక్షాలు వాపోయాయి. నిషేధిత రోజుల్లో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇచ్చే ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ఇతర మత్య్సకారులకు సైతం వర్తింపజేయాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే రవి కోరారు. మంత్రి జయపాల్ ఇందుకు సమాధానం ఇస్తూ రిజర్వాయర్లు, నదుల్లో చేపలుపట్టేవారికి వేరే ఉద్యోగాలు ఉన్నందున సహాయం కుదరదని స్పష్టం చేశారు.