సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మా అంటూ తమిళ ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే జయలలిత తొలి వర్ధంతికే న్యాయపరమైన చిక్కులు సృష్టించే ప్రయత్నం జరిగింది. అయితే సోమవారం ఆ చిక్కులు తొలగిపో వడంతో వర్ధంతి నిర్వహణకు ప్రభుత్వం సన్నాహమైంది. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన స్వల్ప అనారోగ్యకారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డిసెం బర్ 4న సాయంత్రం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లు సమాచారం వచ్చింది. 5వ తేదీన సాయంత్రం కన్నుమూసినట్లుగా అధికారిక ప్రకటన విడుదలైంది. చెన్నై మెరీనాబీ చ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే 6వ తేదీన జయకు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోగ్యంగా ప్రచారం చేసిన జయలలిత అకస్మాత్తుగా ఆస్పత్రి పాలుకావడం, కోలుకుంటున్నారని, రేపో మాపో డిశ్చార్జి అని ప్రచారం జరుగుతుండగానే కన్నుమూసారు. దీంతో జయ మరణంపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. జయ నెచ్చెలి శశికళవైపు అందరూ అనుమానంగా చూశారు.
నిరసన గళం
ఆస్పత్రిలో 75 రోజుల పాటు అత్యున్నత స్థాయిలో అంతర్జాతీయ వైద్యులు చేసిన చికిత్స ఏమైందని దేశవ్యాప్తంగా ప్రశ్న తలెత్తింది. ప్రతిపక్షాలు నిరసన గళమెత్తాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేశాయి. అన్నాడీఎంకేలో చీలికవర్గ నేత పన్నీర్‌సెల్వం సైతం విచారణకు పట్టుబట్టారు. నలువైపులా వస్తున్న ఒత్తిళ్లతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25వ తేదీన రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించారు. మూడునెలల్లోగా నివేదిక అందజేయాలని కమిషన్‌కు సీఎం గడువు విధించారు.
వేలిముద్రలపై వివాదం
గత ఏడాది అక్టోబరులో వచ్చిన మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే అభ్యర్థులకు జారీచేసిన బీఫారంలోని జయ వేలిముద్రలు ఆమె మరణించిన తరువాత వేసిన వని డీఎంకే న్యాయవాది శరవరణన్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడంతోపాటు వేలిముద్రల్లోని తేడాలను మీడియా ముందు ప్రదర్శించారు. జయలలిత మరణం అక్టోబరా లేక డిసెంబరా అనే అనుమానాలను ప్రజల్లో ఆయన లేవనెత్తారు. ఇప్పటికే అనేకమందిని విచారించిన కమిషన్ సోమవారం మరో 60 మందికి సమన్లు జారీచేసింది.
హైకోర్టులో పిటిషన్
జయలలిత తొలి వర్ధంతి దగ్గరపడడంతో డిసెంబర్ 5వ తేదీన జయ సమాధి వద్ద వర్దంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ సన్నాహాలను అడ్డుకునే విధంగా న్యాయవాది దురైస్వామి మద్రాసు హైకోర్టులో గతనెల 28వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత వర్ధంతిని డిసెంబర్ 5వ తేదీన ప్రభుత్వం నిర్వహించకుండా స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. జయ మరణ తేదీ, సమయం నిర్ధారణ జరిగే వరకు అధికారికంగా వర్ధంతి నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని అనుమతించరాదని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.
ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా హైకోర్టు న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ కొట్టివేశారు. అలాగే, జయ మరణ మిస్టరీపై పోలీసు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఆర్ కృష్ణమూర్తి అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వం తరఫున విచారణ కమిషన్ నియమించిన తరువాత మరో పోలీసు కేసు అవసరం ఏమిటని న్యాయవాదికి అక్షింతలువేసింది. దీంతో నేడు (మంగళవారం) జయలలిత తొలి వర్ధంతికి మార్గం సుగమం అయింది. రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ ఉద్యోగులు వేర్వేరుగా నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment