
కేబినెట్ విస్తరణపై తేజస్వీ విసుర్లు
పట్నా: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. కేబినెట్ పునర్వ్యస్థీకరణ వృధాప్రయాస అని వ్యాఖ్యానించారు. డ్రైవర్ అసమర్ధుడైనప్పుడు వాహనానికి ఎన్ని హంగులున్నా సరిగా నడపలేరంటూ ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా విమర్శించారు. ‘బండి ఇంజిన్, టైర్లు, క్లచ్, బ్రేకు మార్చినా లేదా కొత్త వాహనం సరిగా నడపాలన్నా డ్రైవర్ సమర్థుడై ఉండాలి. చోదకుడిగా సరైన వ్యక్తి లేకుంటే ఎన్ని హంగులున్నా వాహనం నడవద’ని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు.
సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీలకు ప్రధాని ఝలక్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. వీరిద్దరూ వ్యతిరేకించే బిహార్ ఎంపీలు రాజ్‌కుమార్ సింగ్, అశ్వినీ చౌబేలకు మంత్రి పదవులిచ్చి నితీశ్-సుశీల్ వర్గానికి ప్రధాని మోదీ గట్టి సందేశం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ఇచ్చిన షాకు నుంచి నితీశ్ త్వరగా తేరుకోవాలని తేజస్వీ యాదవ్ అన్నారు.