
ముంచంగిపుట్టు (అరకులోయ): ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు మళ్లీ అలజడి సృష్టించారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడ్ని దళసభ్యులు హతమార్చడంతోపాటు ఇద్దరిని తమ వెంట తీసుకెళ్లారు. సరిహద్దు గ్రామాల్లో మరి కొందరి కోసం గాలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంఘటనతో ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం ముంచంగిపుట్టుతోపాటు ప్రధాన కూడళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. జోలాపుట్టు, డుడుమ, కుమడ ప్రాంతల నుంచి వచ్చే వాహనాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. బస్సులతోపాటు వాహనాల్లో రాకపోకలు సాగించేవారి లగేజీ బ్యాగులను తనిఖీ చేసి విడిచిపెడుతున్నారు. అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. హిట్‌లిస్టుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను మరుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉద్రిక్త పరిస్థితులతో ఎప్పుడే సంఘటన చోటు చేసుకుంటుందోనని బిక్కుబిక్కు మంటూ మరుమూల గిరిజనులు జీవనం సాగిస్తున్నారు.
సంఘటన ఇలా..
ముంచంగిపుట్టు మండలం మారుమూల బుంగాపుట్టు పంచాయతీ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఒడిశా మల్కన్‌గిరి జిల్లా జోడం బ్లాక్ పనసపుట్టు పంచాయతీ మొండిగుమ్మ గ్రామానికి చెందిన కిల్లో ధనపతి ఇంటికి సాయుధ దళసభ్యులు మంగళవారం రాత్రి వచ్చారు. ఇంటిని చుట్టుముట్టారు. నిద్రపోతున్న ధనపతిని లేపి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రజా కోర్టు నిర్వహించి పోలీస్ ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ హతమార్చారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు అడవిలోకి వెళ్లి చూడగా రక్తపుమడుగులో శవమై ఉన్నాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని, అందుకే హతమార్చినట్టు మావోయిస్టులు ఒక లేఖను మృతదేహం వద్ద విడిచిపెట్టి వెళ్లారు. అలాగే అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరికి దేహశుద్ధి చేయడంతోపాటు తమ వెంట తీసుకెళ్లారు. ఈ సంఘటనతో కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మళ్లీ అలజడి రేగింది. దీంతో సరిహద్దు గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం చోటుచేసుకుంది. ఇళ్లల్లోనుంచి ఆదివాసీలు బయటకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment