ఏవోబీ సరిహద్దు ప్రాంతంలో గాలిస్తున్న పోలీసు బలగాలు
విశాఖపట్నం, అరకులోయ, పెదబయలు: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సోమల హత్యోదంతం తరువాత పోలీసుశాఖ అప్రమత్తమైంది. మన్యానికి అదనపు పోలీసు బలగాలు చేరాయి. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తూ బలగాలు ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా ఏవోబీకి ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు,పెదబయలు, జి.మాడుగుల, జీకే వీధీ, డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి మండలాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బుధవారం డీజీపీ పర్యటించడంతో భారీగా పోలీసు పార్టీలను రంగంలోకి దింపారు. ఆయన పర్యటన ముగిసినప్పటికీ ఆ పార్టీలను మన్యంలోనే ఉంచారు. అనంతగిరి నుంచి అరకులోయ,అరకులోయ నుంచి పాడేరు రోడ్డులో పోలీసు పార్టీలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనంతగిరి ఘాట్, సుంకరమెట్ట,జైపూర్ జంక్షన్,డుంబ్రిగుడ,కించుమండ,హుకుంపేట ప్రాంతాల్లో కూడా పోలీసు పార్టీల ను అధికంగా మోహరించారు. అడవులల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక పోలీసు పార్టీలను అన్ని పోలీసుస్టేషన్లలో అందుబాటులో ఉంచారు.
♦ సీఎం చంద్రబాబు మన్యంలో పర్యటించనుండడంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
♦ బాంబు స్క్వాడ్ తనిఖీలుఅనంతగిరి–అరకు,అరకు–పాడేరు రోడ్డులో బాంబు స్క్వాడ్ బృందాలు గురువారం తని ఖీలు నిర్వహించాయి. రహదారులకు ఇరువైపు ల, గెడ్డల వద్ద ,కల్వర్టులు, వంతెనల సమీపంలో క్షు ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు మరి కొద్ది రోజుల పాటు ఈరోడ్లలో ఉంటాయని పోలీసుఅధికారులు చెబుతున్నారు.
చివురుటాకులా..
ఇప్పుడు ఏజెన్సీ గ్రామాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. అడుగుకో పోలీసు తుపాకులతో కనిసిస్తుండడంతో గిరిజనులు తీవ్ర భయోం దోళన చెందుతున్నారు. అనుమానితులను బలగాలు ప్రశ్నిస్తుండడంతో గ్రామాలను వదిలి బయటకురావడానికి వారు సాహసించడం లేదు. మండలకేంద్రానికి వెళ్లవలసిన అవసరం ఉన్నా, పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
సంఘటన స్థలంలో కిడారికి నివాళి
డుంబ్రిగుడ(అరకులోయ): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన స్థలంలో గురువారం సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఇద్దరు కుమారులు, కుమార్తె పూలదండలు పెట్టి, పుష్పగుచ్చాలు పట్టుకుని నివాళి అర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. కుటుంబ సభ్యుడు పాండురంగస్వామి మాట్లాడుతూ మంచి ఎమ్మెల్యేను కోల్పోయామన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పటికీ అరకు,పాడేరులలో సొంత ఇల్లు కూడా లేదని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిడారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment