తంజావూరులోని శశికళ ఇల్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కూలిపోయేస్థితికి చేరుకున్న ఇంటిలో కాపురమా..ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరమ్మా బాధ్యులంటూ తంజావూరు కార్పొరేషన్ అధికారులు చిన్నమ్మను నిలదీశారు. మీరు కూల్చకుంటే మేమే ఆ పనిచేస్తామని హెచ్చరిస్తూ బుధవారం సాయంత్రం ఇంటిగోడపై నోటీసు అంటించారు. తమిళనాడు ప్రజలకు చిన్నమ్మ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలిగా, అమ్మ తరువాత చిన్నమ్మే అన్నంతగా పేరుబడిన శశికళ పార్టీలోనూ, పాలనలోనూ చక్రం తిప్పారు. శశికళకు సంబంధించి ఏ చిన్న అంశమైనా రాష్ట్రంలో చర్చనీయాంశమే. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో మూడేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నా ఏదోరకంగా వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తున్నారు. తంజావూరులోనిశశికళ సొంతింటిని కూల్చివేసేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధం కావడం ద్వారా చిన్నమ్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళకు చెన్నై, తంజావూరులలో సొంతిళ్లు ఉన్నాయి. తంజావూరులో 10,500 చదరపు అడుగుల్లోని సొంతింటిలో మనోహర్ అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. తంజావూరు కార్పొరేషన్ అధికారులు గత నెల ఆ ఇంటిని పరిశీలించి నివాసయోగ్యం కానంతగా పాడుబడి పోయి ఉందని నిర్ధారించారు.
ఈ ఇంటిని వెంటనే కూల్చకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ శశికళ, అద్దెకున్న మనోహర్‌కు కార్పొరేషన్ కమిషనర్ జానకీ రవిచంద్రన్ నోటీసులు జారీచేశారు. నోటీసులోని వివరాలు ఇలా ఉన్నాయి. తంజావూరు కార్పొరేషన్ పరిధిలోని ఎస్‌పీజీ మిషన్ ఉన్నతపాఠశాల రోడ్డులో ప్రమాదస్థితిలోని ఉన్న శశికళ ఇంటిని కూల్చివేయకతప్పదు. 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇంటిని ఖాళీచేయకుంటే ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలకు ఇంటి యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేగాక కార్పొరేషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటూ నిర్మాణాన్ని తొలగించేందుకు అయిన ఖర్చులను ఇంటి యజమాని నుంచి వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు.
నోటీసులు జారీచేసిన తరువాత కూడా ఇంటిని కూల్చకపోవడం, ఖాళీ చేయకపోవడం తంజావూరు తహశీల్దారు వెంకటేశన్, కార్పొరేషన్ ఇంజినీర్లు బుధవారం సాయంత్రం శశికళ ఇంటికి చేరుకుని మనోహరన్‌ను విచారించారు. చెన్నైలోని శశికళ బంధువులకు నోటీసు విషయం చెప్పాను, ప్రస్తుతం ఆ ఇంటిలో ఎవ్వరూ నివసించడం లేదు, తాను వెనుకనున్న పోర్షల్ ఉంటున్నానని మనోహరన్ అధికారులకు వివరించాడు. దీంతో శశికళ ఇంటి ప్రవేశద్వారంలోని గోడపై నోటీసు అంటించారు. ఇంటిని ఖాళీచేసి కూల్చివేయాల్సిందిగా నోటీసులో ఇచ్చిన గడువు తీరిపోయింది, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని అధికారులు మనోహరన్‌ను నిలదీశారు. ఇంటిపై నోటీసు అంటించిన కారణంగా వెంటనే ఖాళీచేయాలి, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. శశికళ ఇంటిని కూల్చివేసేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment