నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్
టీనగర్, న్యూస్‌లైన్: రైలులో 9 లక్షల నకిలీ కరెన్సీనోట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ బెంగాల్ నుంచి రైలు ద్వారా చెన్నైకు నకిలీ కరెన్సీ నోట్లు తరలిస్తున్నట్లు సీబీసీఐడీ పోలీసులకు సమాచారం అందింది. పోలీసు సూపరింటెండెంట్ పెరుమాల్ పర్యవేక్షణలో డీఎస్పీ రత్నమణి ఆధ్వర్యంలో చెన్నైకు వచ్చే రైళ్లు, రైల్వే స్టేషన్‌లలో సీబీసీఐడీ పోలీసులు నిఘా పెట్టారు.
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రైలు నుంచి దిగిన సాహుల్ వ్యాసర్పాడిలోని రఫిక్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. పోలీసులు అతన్ని వెంబడించి విచారణ చేపట్టగా వెస్ట్ బెంగాల్ నుంచి సాహుల్ నకిలీ కరెన్సీ నోట్లను రైలులో తరలించినట్లు తెలిసింది. రఫిక్ ఆదేశాలతో నకిలీ కరెన్సీ నోట్లను అక్కడ నుంచి సాహుల్ తీసుకువచ్చినట్లు తెలిసింది. వారి వద్ద నుంచి *500, *1000 నకిలీ కరెన్సీ నోట్లు తొమ్మిది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీనికి సంబంధించి రఫిక్, సాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రఫిక్ ఇది వరకే నకిలీ కరెన్సీనోట్ల కేసులో అరెస్టు అయ్యారు. వెస్ట్ బెంగాల్‌లో ఎవరి వద్ద నుంచి రఫిక్ నకిలీ కరెన్సీ నోట్లను తీసుకువచ్చారనే విషయంపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ తీవ్రవాది జాకీర్ హుసేన్‌తో ఇతనికి సంబంధాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలులో నిర్బంధించారు. రఫీక్‌ను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు పోలీ సులు నిర్ణయించారు.