పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మొదలయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 4న షెడ్యూలు ఖరారు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మొదలయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమావేశాల షెడ్యూలును ఖరారు చేసేందుకు పార్లమెంటరీ వ్యవహారా కేబినెట్ కమిటీ వచ్చే నెల 4న భేటీ కానుంది. రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లను ప్రవేశపెట్టటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ.. జీఎస్‌టీ, రియల్ ఎస్టేట్ వంటి కీలక బిల్లులకు కూడా ఈ భేటీల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది.
సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారంలో మొదలై.. మే ఆరంభంలో ముగుస్తాయి. మధ్యలో.. బడ్జెటరీ డిమాండ్లు, గ్రాంట్లను కమిటీలు చర్చించేటపుడు పార్లమెంటు సమావేశాలకు విరామం ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజైన 29వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టటం ఆనవాయితి. ఈ ఏడాది 23 నుంచి సమావేశాలు మొదలయ్యే అవకాశముంది. అయితే ఇవి కొనసాగుతుండగానే పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. (ఈ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల కాలపరిమితి మే-జూన్ నెలల్లో ముగియనుంది.) దీంతో పార్లమెంటు సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే దానిపై సందిగ్ధత తలెత్తే అవకాశముంది. ఆయా పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా పార్లమెంటు సమావేశాల నిడివిని తగ్గించే అవకాశముందని చెప్తున్నారు.