
ఓ ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం
పిల్లలకు పాఠాలు బోధించే ఓ ప్రధానోపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గంలో పయనించింది. దళిత మహిళా సర్పంచ్ పప్పీదేవి పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. కుల దురహంకారాన్ని ప్రదర్శించాడు. ఆమె కూర్చున్న కుర్చీని నీటితో శుద్ధి చేయించాడు. గ్రామంలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో గ్రామ అధికారిగా పప్పీ దేవి పరిశీలనకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షించేందుకు కాన్పూర్‌లోని దేహత్ పాఠశాలను పప్పీదేవి సందర్శించారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోశ్ శర్మను నిలదీశారు. పేద విద్యార్థులకు పెట్టాల్సిన భోజనాన్ని జాగ్రత్తగా అందించాలని.. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్పంచ్ హెచ్చరికలను ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. పైగా మరింత రెచ్చిపోయాడు.
'నన్ను అడిగేంత ధైర్యం నీకెక్కడిది.. నా ముందే కుర్చీలో కూర్చుంటావా' అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఎందుకు కూర్చోకూడదని నిలదీసిన పప్పీదేవిని చంపేస్తానంటూ బెదిరించాడు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ఆమె భర్తపై కూడా బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆయన ఆగ్రహం చల్లారలేదు. ఆమె కళ్లముందే ఆమె కూర్చున్న కుర్చీని నీటితో శుద్ధి చేయమని విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు వచ్చి ఆ కుర్చీని శుభ్రం చేసేదాకా వదిలిపెట్టలేదు.
దీంతో కలత చెందిన పప్పీదేవి తనకు జరిగిన అవమానాన్ని జిల్లా పాలనా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. వివక్షాపూరితగా వ్యవహరించి, తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్నారు. తనను, తన భర్తను తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరించాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక తహసీల్దారును ఆదేశించారు.