
నన్ను అవహేళన చేసినా పర్లేదు..
ఆ పది ప్యాకెట్లలో ఏమున్నాయో చెప్పండి
► ప్రధాని మోదీకి రాహుల్‌గాంధీ సవాల్
బహ్రైచ్: ప్రధాని మోదీపై విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. కార్పొరేట్ గ్రూపుల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై మోదీ స్పందిస్తూ.. రాహుల్‌ను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం స్పందించిన రాహుల్.. తనను మోదీ అవహేళన చేసేలా మాట్లాడినా ఫర్వాలేదని, అయితే వ్యక్తిగత అవినీతికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో గురువారం నిర్వహించిన జన ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.
ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నది తాను మాత్రమే కాదని, దేశంలోని యువత కూడా ఇదే విధంగా భావిస్తోందని, ఉద్యోగాలు కల్పిస్తామని మోసగించినట్టుగా వారంతా భావిస్తున్నారని చెప్పారు. సహారా, బిర్లా గ్రూపుల నుంచి గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు ముడుపులు స్వీకరించారంటూ దీనికి సంబంధించిన పత్రాలను రాహుల్ చూపించారు. 2013–14 మధ్య ఆరు నెలల కాలంలో సహారా గ్రూపు నుంచి తొమ్మిది విడతల కింద మోదీ రూ. 40 కోట్లు తీసుకున్నారని రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దుకు సంబంధించి ఆశ్చర్యకరంగా మోదీ తీసుకున్న నిర్ణయం పేదల కోసం కాదని, దేశంలోని 50 పెద్ద కంపెనీల కుటుంబాల కోసం అని విమర్శించారు.
అవినీతి ఆరోపణలకు జవాబివ్వండి
అంతకుముందు రాహుల్ ట్విటర్ వేదికగా మోదీపై విమర్శలు గుప్పించారు. సహారా గ్రూపు నుంచి మీరు స్వీకరించిన పది ప్యాకెట్లలో ఏమున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ట్వీట్‌తోపాటు ఆదాయపన్ను శాఖకు సమర్పించిన 9 పత్రాలనూ రాహుల్ పోస్ట్ చేశారు. అక్టోబర్ 2013 నుంచి ఫిబ్రవరి 2014 మధ్య మోదీజీకి చెల్లించిన క్యాష్ పేమెంట్ల పేరిట ఈ ప్రతాలు ఉన్నాయి.