వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి మార్గదర్శకాలు
విడుదల చేసిన మంత్రి వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో వృద్ధులు, వికలాంగులు ఎటువంటి అడ్డంకుల్లేకుండా సులభంగా వెళ్లడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారమిక్కడ విడుదల చేశారు. కొత్తగా నిర్మించే ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో వృద్ధులు, వికలాంగులు లిఫ్ట్‌లు, మెట్లు, వీల్‌చెయిర్‌పై వెళ్లడానికి వీలుగా తగిన మార్పులు చేయడం ఆయా పట్టణ ప్రణాళికలో, భవన నిర్మాణంలో ఒక భాగం కావాలనేది ఈ మార్గదర్శకాల ఉద్దేశమని వివరించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా ఆమోదించి స్థానిక సంస్థలకు సిఫార్సు చేయాలన్నారు. పట్టణ గణాంకాలతో కూడిన కరదీపికను ఆయన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పట్టణాలకు సంబంధించిన పూర్తి గణాంకాలు, ఆయా పట్టణాల్లో ఉన్న రహదారులు, నీటిసౌకర్యం, పారిశుద్ధ్యం, హౌసింగ్, విద్యాసంస్థలు తదితర వివరాల సమగ్ర దర్శిని ఇదన్నారు. దీన్ని రాష్ట్రప్రభుత్వాలు కిందిస్థాయివరకూ తీసుకెళ్లాలన్నారు.
విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం వద్దు
‘వర్సిటీల్లో రాజకీయం జోక్యం ఉండరాదు. దయచేసి రాజకీయ నేతలు వర్సిటీల వాతావరణాన్ని కలుషితం చేయవద్దు. ఆ విశ్వవిద్యాలయంలో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, పరిపాలనా మండలి ఆ విషయాల్ని సరిచూసుకోగలరు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. హెచ్ సీయూలో జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందన్న వార్తలపై మంత్రి స్పందిస్తూ..రోహిత్ ఆత్మహత్య ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిదని, అది పూర్తవాల్సి ఉందని చెప్పారు. ఎవరూ హింసకు పాల్పడకూడదని, చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని సూచించారు. రాజకీయ అవసరాలకోసం విశ్వవిద్యాలయాల వాతావరణాన్ని కలుషితం చేయకూడదని తాను అందర్నీ కోరుతున్నానన్నారు.