జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు ముందుకుపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ప్రధాని మోదీ చర్చించగా..
♦ నేడు పీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల విడివిడి భేటీలు
♦ ఇరుపార్టీల చీఫ్‌లతో రేపు గవర్నర్ సమావేశం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు ముందుకుపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ప్రధాని మోదీ చర్చించగా.. శుక్రవారం పీడీపీ, బీజేపీ నేతలతో గవర్నర్ సమావేశం కానున్నారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ శర్మలను గవర్నర్ వోరా సమావేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు వీరిద్దరితో వోరా ప్రత్యేకంగా సమావేశం కానున్నారని రాజ్‌భవన్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, రెండ్రోజుల క్రితం మోదీతో సమావేశమైన ముఫ్తీ.. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ శాసనసభాపక్షంతో భేటీ కానున్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతోపాటు భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుపైనా ఇందులో చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, ప్రధానితో సమావేశం ద్వారా ముఫ్తీ సూచించిన ఏ కొత్త ప్రతిపాదనకు అంగీకరించలేదని బీజేపీ స్పష్టం చేసింది. కాగా, నెలరోజులుగా జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడే సూచనలున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. మోదీ-ముఫ్తీ మధ్య భేటీ సుహ్రృద్భావపూర్వక వాతావరణంలో జరిగిందన్నారు. కాగా, జమ్మూలో గురువారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.