అతిపెద్ద రైల్వే వ్యవస్థలు
భారతీయ రైల్వే... ఉద్యోగుల సంఖ్యలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఎనిమిదో స్థానం...రైళ్ల సంఖ్య, సదుపాయాలు, నిర్వహణ , హైస్పీడ్ మార్గాల ఏర్పాటులో మాత్రం ఎప్పుడూ వెనుకంజే... ప్రపంచంలోని పెద్ద రైల్వే వ్యవస్థల్ని పరిశీలిస్తే...
అమెరికా
దాదాపు 2,50,000 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లు ఉండగా... వీటిలో 80 శాతం సరుకు రవాణా కోసంనడుపుతున్నారు. ప్రయాణికుల కోసం వాడే లైన్లు కేవలం 35 వేల కి.మీ.లు మాత్రమే. రైలు ప్రయాణంపై ప్రజలు ఎక్కువగా ఆధారపడకపోవడమే దీనికి కారణం. ఆయా రాష్ట్రాలే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్ రోడ్ సంస్థల్ని నిర్వహిస్తున్నాయి. ఆమ్‌ట్రాక్ సంస్థ 46 రాష్ట్రాల్లో 500 గమ్యస్థానాల్ని కలుపుతూ రోజుకు 300 రైళ్లు నడుపుతోంది.
చైనా
121,000 కి.మీ.లతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. 1945 నాటికి చైనాలో 27 వేల కిలోమీటర్లు రైల్వే లైన్లు ఉండగా ఇప్పుడది ఐదు రెట్లు పెరిగింది. 57 వేల కి.మి.ల మేర డబుల్‌ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 65 వేల కి.మీ.లు విద్యుదీకరణ చేశారు. 16 వేల కి.మీ.లు హైస్పీడ్ లైన్లు అందుబాటులో ఉన్నాయి.
రష్యా
మొత్తం రైల్వే లైన్లు 86,000 కి.మి.లు. 2013లో 108 కోట్ల మంది ప్రయాణికుల్ని చేరవేసింది. 120 కోట్ల టన్నుల సరకు రవాణా చేసింది. యూరప్, ఆసియా దేశాలకు రైల్వే లైన్లు ఉండడం ఈ దేశం ప్రత్యేకత. రష్యా నుంచి ఫ్రాన్స్, ఫిన్‌లాండ్ ,జర్మనీ, పోలాండ్, చైనా, మంగోలియా, ఉత్తర కొరియాలకు లైన్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాన్స్ సైబీరియన్ రైల్వే లైన్ మాస్కో నుంచి వ్లాడివోస్టక్ మధ్య ఉంది. దూరం 9,289 కి.మి.లు...
ఇండియా
మొత్తం రైల్వే లైన్లు 65,808 కి.మి.లు. . స్వాతంత్య్రం తర్వాత కేవలం 14 వేల కిలోమీటర్లు మాత్రమే మార్గాల్ని విస్తరించారు. ఏడాదికి కేవలం 200 కి.మి.లు మాత్ర మే కొత్త మార్గాలు వస్తున్నాయి.