ఇక మనదేశంలోనూ ఆ తరహా పెళ్లిళ్లు
ఆహ్లాదకరమైన వాతావరణంలో, జీవితాంతం గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుక జరుపుకోవాలని అనుకోవడం మామూలే. కాసులకు వెరవకుండా.. నింగిపై.. నేలపై అంటూ విభిన్నంగా ఆలోచించే జంటలకు కూడా మన దేశంలో కొదవలేదు. ఈ ఆలోచనలనే మన ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అందుకే నడి సముద్రంలో ముచ్చటగా మూడు ముళ్ల తంతును అత్యంత రొమాంటిక్‌గా జరిపించడానికి కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విదేశాల్లో కాసులు కురిపిస్తున్న ఈ తరహా పెళ్లిళ్లను త్వరలో మన దేశంలో కూడా పరిచయం చేయబోతున్నట్టు తెలిపారు.
సముద్రంలో విహారానికి వినియోగించే విహార ఓడలను వివాహ వేదికలుగా అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సముద్రంలోను, ఆకాశమార్గాన విహరించేందుకు సీ ప్లేన్ సేవలను కూడా ప్రారంభించనున్నామని వెల్లడించారు. నడి సముద్రంలో ఓడలపై కొత్త తరహా పెళ్లి వేదికలకు శ్రీకారం చుట్టునున్నామని ఆయన తెలిపారు. వీటి ఆమోదం కోసం పౌరవిమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్‌కు పంపామన్నారు. దీంతోపాటు అదనంగా విందు, వినోదం లాంటి సకల సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. అంటే ఇక హిందూ మహాసముద్రంపైనో.. బంగాళాఖాతం నట్ట నడిమధ్యనో లేదా అరేబియా సముద్రంపైనో విలాసంగా వధూవరులు విహరించవచ్చన్నమాట. అయితే మొదట కొచ్చిన్ , చెన్నై, ముంబైలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు వీలుగా షిప్పింగ్, పర్యాటకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొత్త పర్యాటక విధానాలను రూపొందించనున్నట్టు తెలిపారు. భూమి మీద, నీటి మీద కూడా ల్యాండయ్యే విమానాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామన్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, సముద్ర విమానాల లాంటి సేవలతో పాటు ఈ క్రూయిజ్ పర్యాటక పెట్టుబడిలో ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్టు గడ్కరీ తెలిపారు. ఇప్పటికే 101 జలమార్గాలలో ఇలాంటి 25 విమానాలను నడిపేందుకు ప్రైవేట్ సంస్థ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా 7,500 కి.మీ పొడవైన తీరప్రాంతం ఉన్నా.. భారతదేశంలో ఈ తరహా పర్యాటక అభివృద్ధి తక్కువగా ఉందన్నారు. అందుకే ఈ తరహా అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు.