ప్రతి ఐదేళ్లకూ మార్చేయడమే... | The strength of the BJP-caste and religion? | Sakshi
Sakshi News home page

ప్రతి ఐదేళ్లకూ మార్చేయడమే...

Published Sun, Apr 3 2016 2:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ప్రతి ఐదేళ్లకూ మార్చేయడమే... - Sakshi

ప్రతి ఐదేళ్లకూ మార్చేయడమే...

ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు మొదటిసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కేరళ.  2011లో రెండోసారి సీఎం అయిన ఊమెన్ చాందీ నేతృత్వంలోని యునెటైడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) ఐదేళ్ల సంక్షుభిత పాలన తర్వాత అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఈసారి తమదే అధికారమనే ధీమా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌లో కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం జరిపిన అన్ని ఎన్నికల సర్వేలూ ఎల్డీఎఫ్‌కే విజయావకాశాలున్నట్టు సూచిస్తున్నాయి.

2011 కేరళ అసెంబ్లీ ఎన్నికలు చరిత్ర నిలిచిపోయే విధంగా ఫలితాలనిచ్చాయి. 140 సీట్లున్న అసెంబ్లీలో స్వల్ప ఆధిక్యంతో ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. సీపీఎం అగ్రనేతలతో, రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పినరాయి విజయన్‌తో కీచులాటలకు దిగినప్పటికీ సమర్థ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న సీనియర్ కమ్యూనిస్ట్ వీఎస్ అచ్యుతానందన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌కు 68 సీట్లు రాగా, 72 స్థానాలతో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఉప ఎన్నికల్లో రెండుమూడు విజయాలు, వామపక్ష ప్రజాతంత్ర కూటమిలోని ఒకట్రెండు చిన్న పార్టీలను బయటికి లాగి వాటితో చేతులు కలపి యూడీఎఫ్ సుస్థిరంగా సర్కారును పూర్తికాలం నడిపింది.

 స్కాములే స్కాములు...
 అక్రమార్జన, కుంభకోణాలు, అవినీతికి మారుపేరుగా చాందీ ప్రభుత్వం నిలిచింది. ఈ కుంభకోణాలు, అప్రతిష్ట నుంచి బయటపడానికి చేసిన ప్రయత్నం పాక్షిక మద్యపాన నిషేధం కూడా యూడీఎఫ్ సర్కారును మరిన్ని అవినీతి కుంభకోణాల్లోకి నెట్టింది. సోలార్ కుంభకోణం, బార్ యజమానుల నుంచి లంచాలు ఆశించారనే కుంభకోణంతో చాందీ సర్కారు పరువు పూర్తిగా పోయింది. అవినీతి ఆరోపణల కారణంగా చాందీ కేబినెట్ నుంచి కేరళ కాంగ్రెస్ నేత కె.ఎం.మణి రాజీనామా చేయాల్సివచ్చింది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో అసంబద్ధంగా వ్యవహరించి మరో మంత్రి ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. ఇవన్నీ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కు అనుకూల పరిణామాలే అయినా మరో పక్క ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో కొన్ని జిల్లాల్లో బలపడుతున్న బీజేపీ మార్క్సిస్టులకు కలవరం పుట్టిస్తోంది.
 
 బీజేపీ బలం మతం-కులం?

 కేరళలో ముస్లింలు, క్రైస్తవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడం కూడా బీజేపీకి రాష్ట్రంలో అడుగుపెట్టి బలపడానికి అనుకూల అంశమని కాషాయ కూటమి నేతలు భావిస్తున్నారు. కేరళలో హిందువులు 54.7 శాతం, ముస్లింలు 24.6 శాతం, క్రైస్తవులు 18.4 శాతం ఉన్నారని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ హిందువుల్లో అత్యధిక వర్గాల మద్దతు కమ్యూనిస్టులకు లభిస్తోంది. అగ్రవర్ణాలతోపాటు హిందూ బీసీల్లో పెద్ద వర్గమైన ఈళవ కులస్థుల మద్దతు మొదటి నుంచీ కమ్యూనిస్టులకే లభిస్తోంది. జనాభాలో ఈ వర్గం జనాభా 24 శాతం ఉందని అంచనా. కల్లుగీత వృత్తిగా ఉన్న ఈళవ వర్గంవారిని అంటరానివారిగా కేరళ హిందూ సమాజం చూసే రోజుల్లో ఈ వర్గం కుటుంబంలో పుట్టిన నారాయణ గురు సంఘసంస్కర్తగా ఎదిగారు.

ఈళవులతోపాటు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన కృషిచేశారు. ఆయన పేరుతో స్థాపించిన శ్రీనారాయణ గురు పరిపాలనా యోగం(ఎస్‌ఎన్‌డీపీ) ఈ సామాజికవర్గంపై ప్రభావం చూపిస్తోంది.  కమ్యూనిస్ట్ పార్టీలకు తొలి నుంచి పట్టు ఉన్న ఈ సామాజికవర్గానికి దగ్గరవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎస్‌ఎన్‌డీపీ ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కొద్ది నెలల క్రితం నటేశన్ ఓ ఈళవ వర్గం మద్దతుతో భారత ధర్మజన సేన(బీడీజేఎస్) అనే పార్టీ ప్రారంభించి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఇంకా ఒకటి రెండు కుల పార్టీలతో చేతులు కలిపి బీజేపీ కేరళలో చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు సాధించాలని ఆశిస్తోంది. అంటే ఇప్పటి వరకూ సీపీఎంకు మద్దతు ఇస్తున్న హిందూ బీసీ వర్గాల ఓట్లు చీల్చడానికి కాషాయ కూటమి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. బీజేపీ కూటమి ఎక్కువ ఓట్లు చీల్చితే యూడీఎఫ్ మరోసారి మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే అవకాశముందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
 సర్వేలే నిజమైతే సీఎం పదవి వీఎస్‌కా? విజయన్‌కా?
 కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించినప్పటి నుంచీ ఎస్సీ, బీసీ వర్గాల మధ్య పనిచేయడంతో ఈ కులాల జనం కమ్యూనిస్టుల వెంటే చాలా కాలం నడిచారు. ఈళవ కుటుంబాల్లో పుట్టిన ఏకే గోపాలన్, వీఎస్ అచ్యుతానందన్ వంటి బడా నేతలు కమ్యూనిస్ట్ పార్టీల్లో చేరి శ్రామికవర్గం తరఫున పోరాడారు. అయితే, ఇదే సామాజికవర్గానికి చెందిన  పినరాయి విజయన్ కేరళ సీపీఎం కార్యదర్శిగా పట్టు సాధించారు. అయితే, ఇదే వీఎస్ అచ్యుతానందన్‌కు విజయన్‌కు పొసగదు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ మద్దతు విజయన్‌కే ఉండేది. 92 ఏళ్ల వయసులో అచ్యుతానందన్ మరోసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. తర్వాత తరానికి చెందిన విజయన్(72) తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తూ సీఎం పదవికి సీపీఎం తరఫున తానూ అభ్యర్థినని పరోక్షంగా ప్రకటించారు.
 
 96 ఏళ్ల వయసులో కేఆర్ గౌరి అసెంబ్లీకి పోటీ
 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతల్లో బతికి ఉన్న ఏకైక నేత కేఆర్ గౌరి. ఈళవ వర్గానికి చెందిన గౌరి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన టీవీ థామస్‌ను పెళ్లాడింది. పార్టీ చీలినప్పుడు ఆమె సీపీఎంలో చేరగా, థామస్ సీపీఐలో ఉండిపోయారు. 1967 నంబూద్రిపాద్ కేబినెట్‌లో భార్యాభర్తలిద్దరూ రెండు కమ్యూనిస్ట్‌పార్టీల తరఫున మంత్రులుగా ఉన్నారు. 1987 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించాక సీఎం పదవిని ఆశించిన గౌరికి అది దక్కలేదు. అయినా ఈకే నాయనార్ సర్కారులో మంత్రిగా పనిచేశారు.

అయితే. 1993లో సీపీఎం నుంచి వైదొలిగి జనాధిపత్య సంరక్షణ సమితి(జేఎస్‌ఎస్) అనే చిన్న పార్టీ ప్రారంభించి యూడీఎఫ్‌లో చేరారు. యూడీఎఫ్ సర్కార్లలో మంత్రిగా పనిచేసి కొన్నేళ్ల క్రితం ఈ కూటమి నుంచి వైదొలిగారు. కిందటేడాది చివరిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పదవిని కొడియేరి బాలకృష్ణన్ ఆహ్వానం మేరకు తన పార్టీని సీపీఎంలో విలీనం చేయడానికి ప్రయత్నించారుగాని కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. చివరికి ఎల్డీఎఫ్ నాయకత్వం ఈ ఎన్నికల్లో జేఎస్‌ఎస్‌కు సీట్లు కేటాయించడానికి నిరాకరించడంతో ఆమె ఈసారి బీజేపీ కూటమిలో చేరడానికి సమాయత్తమౌతున్నారు. 96 ఏళ్ల వయసులో గౌరి మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు.
 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే 1956 నవంబర్ ఒకటిన అవతరించిన ప్రస్తుత కేరళలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో(1957) అప్పటి అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ(సీపీఐ) కాంగ్రెస్‌ను ఓడించి అత్యధిక సీట్లు సాధించింది. మెజారిటీకి ఒకట్రెండు సీట్లు తగ్గడంతో వి.ఆర్.కృష్ణయ్యర్ వంటి కమ్యూనిస్టు సానభూతిపరులైన ఇండిపెండెంట్ల మద్దతుతో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి కావడం చారిత్రక పరిణామం. ప్రైవేటు విద్యాసంస్థల జాతీయం, భూసంస్కరణల వంటి ప్రగతిశీల చర్యలు తీసుకుంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా మత, కుల శక్తులు కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు మద్దతుతో ఉద్యమించాయి.

అప్పటి కాంగ్రెస్ నేత ఇందిరాగాంధీ సలహాతో నెహ్రూ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు తుంగలోకి తొక్కి తొలి కమ్యూనిస్టు ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. తర్వాత నెమ్మదిగా కమ్యూనిస్టులు కోలుకున్నారు. అంతటి రాజకీయ చైతన్యమున్న కేరళలో 1964 చీలిక తర్వాత సీపీఐ, సీపీఎం 1967లో ఒకసారి చేతులు కలిపినా తర్వాత వాటి దారులు వేరయ్యాయి. సీపీఐ తన జాతీయ విధానంలో భాగంగా 1970ల చివరి వరకూ కాంగ్రెస్‌తో దోస్తీ కొనసాగించింది. 1980 ఎన్నికల నుంచీ ఉభయ కమ్యూనిస్టులూ చేతులు కలిపి లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఫ్)పేరుతో అధికారంలో, ప్రతిపక్షంలోనూ సహజీవనం సాగిస్తున్నారు.
 
మొత్తం సీట్లు 140
మ్యాజిక్ ఫిగర్ 71

2011 ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుపొందిన సీట్లు యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ - యూడీఎఫ్ 72 (కాంగ్రెస్ (39), ముస్లిం లీగ్ (20), కేరళ కాంగ్రెస్, జేఎస్‌ఎస్, ఆరెస్పీ) లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ - ఎల్డీఎఫ్ 68 (సీపీఎం (42), సీపీఐ (13), జేడీఎస్, ఎన్సీపీ, ఇతరులు )

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement