
బిడ్డను పోగొట్టుకున్న చోటే ఆరేళ్లుగా..
కన్న కూతురును పోగొట్టుకున్న ఓ తల్లి, తనలాంటి బాధ మరో తల్లికి రాకూడదని ఆరేళ్లుగా కష్టపడుతోంది.
కన్న కూతురును పోగొట్టుకున్న ఓ తల్లి, తనలాంటి బాధ మరో తల్లికి రాకూడదని ఆరేళ్లుగా కష్టపడుతోంది. నిబద్దతతో పని చేస్తూ డోరిస్ ఫ్రాన్సిస్ అనే ఓ మహిళ ఏకంగా ట్రాఫిక్ హీరోయిన్‌గా పేరుకూడా తెచ్చుకుంది. పోలీసు అధికారిని కాకపోయినా దేశ రాజధాని సమీపంలోని గజియాబాద్‌లో గత ఆరేళ్లుగా వాహనాలను నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు.
2010లో గజియాబాద్‌లోని రద్దీ కూడలిలో ప్రస్తుతం ఫ్రాన్సిస్ పనిచేసే చోటే ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ కారు, ఆటోను ఢీకొంది. ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఫ్రాన్సిస్ కూతురు నిక్కి అక్కడికక్కడే మృతిచెందింది. అయితే ఫ్రాన్సిస్ స్వల్పగాయాలతో బయటపడింది.
'ఆ రోజు వాహనాలను సరిగ్గా నియంత్రించి ఉంటే నా కూతురు నాకు దక్కి ఉండేది. పర్యవేక్షణ లోపంతోనే ఆ కూడలి దగ్గర డ్రైవర్లు నర్లక్ష్యంతో నడుపుతున్నారన్న విషయం నాకు అర్థం అయింది. అందుకే అప్పటి నుంచి ట్రాఫిక్ నియంత్రించే పనిలో నిమగ్నమయ్యాను. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే నా లక్ష్యం. ఏ తల్లీతండ్రులు తమ పిల్లలను కోల్పోకూడదు. అందుకే నా శరీరం సహకరించే వరకు ఈ పని చేస్తూనే ఉంటాను' అని ఫ్రాన్సిస్ కన్నీటి పర్యంతమయ్యారు.
సాధారణంగా ఆ కూడలిలో ఫ్రాన్సిస్ ఉంటే వాహనదారులు ట్రాఫిక్ నిబందనలకు కచ్చింతంగా పాటిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే వారి విషయంలో కట్టె చేత్తో పట్టుకొని మరీ ఫ్రాన్సిస్ ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు.
'నాకు ఆమె కథ తెలుసు, నిస్వార్థంగా ఆమె ఈ పని చేస్తుంది. ఆవిడలాంటి ధైర్యవంతురాలిని నేను ఎక్కడా చూడలేదు. ప్రతి రోజు తన కూతురును కోల్పోయిన చోటు దగ్గరికే వచ్చి ఎలా పని చేయగలుగుతోందో' అని అక్కడే పని చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఒకరు తెలిపారు.