
అఖిలేష్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు
న్యూఢిల్లీ: తన కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు, తనకు మధ్య ఎలాంటి వివాదం లేదని ములాయం సింగ్ యాదవ్ అన్నారు. కొందరు వ్యక్తులు అఖిలేష్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ములాయం సింగ్ తన సోదరుడు శివపాల్ యాదవ్, సన్నిహితుడు అమర్ సింగ్ తదితరులతో కలసి ఎన్నికల సంఘాన్ని కలిశారు. సమాజ్‌వాదీ పార్టీ గుర్తు సైకిల్‌ను తమకే కేటాయించాలని ఈసీని కోరారు.
అనంతరం మీడియాతో ములాయం మాట్లాడుతూ.. పార్టీలో ఓ సమస్య ఉందని, దీని వెనుక ఓ వ్యక్తి ఉన్నాడంటూ సోదరుడు రాంగోపాల్ యాదవ్ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. పార్టీ గుర్తు సైకిల్ ఎవరికి దక్కుతుందనే విషయాన్ని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్నారు.
ఎస్పీలో సాగుతున్న ఆధిపత్య పోరులో అఖిలేష్, ములాయం రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు ఈసీని కలసి తమకే సైకిల్ గుర్తును కేటాయించాలని విన్నవించాయి. అఖిలేష్ వర్గంలో బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగా.. ములాయం వెంట శివపాల్, అమర్ సింగ్‌తో పాటు కొందరు మాత్రమే ఉన్నారు. ఎస్పీలో ఏర్పడ్డ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది.