ఎన్నికల తర్వాత మూడో కూటమి
న్యూఢిల్లీ: 2014 ఎన్నికల తర్వాత మూడో కూటమి ఏర్పడుతుందని, ప్రధానమంత్రి కూడా ఈ కూటమి నుంచే ఎన్నికవుతారని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఎలాంటి కూటమి ఏర్పడబోదని, ఒకవేళ ఏర్పడితే సీట్ల పంపకాల్లో పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతాయని అన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీగానీ, కాంగ్రెస్‌గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కూటమి ఏర్పాటు విషయంలో తమ పార్టీ.. సీపీఎం, సీపీఐ నేతలతో సంప్రదింపులు జరుపుతోందని, ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు వివరించారు. ‘కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. ఈ కూటమి నుంచే ప్రధాని ఎన్నికవుతారు’ అని తెలిపారు. మూడో కూటమి నుంచి ఎవరు ప్రధాని బరిలో ఉంటారని అడగ్గా... ‘ఇప్పటిదాకా ఒక్క పార్టీ మాత్ర మే తన ప్రధాని అభ్యర్థిని ప్రకటించింది కదా..’ అని బదులిచ్చారు. మతతత్వ శక్తులతో పోరాడేందుకు సంయుక్త కార్యాచరణ రూపొందించేందుకు లెఫ్ట్‌తోపాటు వివిధ పార్టీలు ఈనెల 30న ఢిల్లీలో ఒక సదస్సు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ భేటీలో థర్డ్‌ఫ్రంట్‌పై కూడా సమాలోచనలు జరుగుతాయని సమాచారం.
థర్డ్‌ఫ్రంట్‌లో చేరేది లేదు: నితీశ్
తమ పార్టీ జనతాదళ్(యు) థర్డ్‌ఫ్రంట్‌లో చేరబోదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ఏర్పడబోయే థర్డ్‌ఫ్రంట్‌లో చేరేది లేదన్నారు.మరి కాంగ్రెస్‌తో జత కడతారా అని విలేకరులు ప్రశ్నించగా, తమ పార్టీలో ఇంకా ఆ విషయమే చర్చించకపోతే ఎలా చెప్పగలను అని ఆయన అన్నారు.
ఎన్నికలకు ముందు మైత్రికి సీపీఎం యత్నం
సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర లౌకిక శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంపై సీపీఎం దృష్టి సారించింది. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ, జేడీ(యూ), జేడీ(ఎస్), బీజేడీతో పాటు ఇతర పార్టీలతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ కసరత్తులో భాగంగా మొట్టమొదట.. ఈ నెల చివర్లో మతతత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ నిర్వహించనున్న సదస్సుకు ఆయా పార్టీల నేతలంతా హాజరయ్యేలా చూడాలని భావిస్తోంది. మతతత్వ శక్తులతో పొంచి ఉన్న ప్రమాదం నుంచి లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెసేతర లౌకిక పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇలా జట్టు కట్టడం థర్డ్ ఫ్రంట్‌కు దోహదపడే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు.. ఇదంతా ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఢిల్లీ సదస్సును విజయవంతం చేయడంపైనే తాము దృష్టి సారించామని, ప్రస్తుతానికి అదే తమ లక్ష్యమని అన్నారు. కాగా రెండురోజుల పాటు ఇక్కడ జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో భేటీ ఈ సదస్సుకు మద్దతు తెలిపింది. ప్రజల మధ్య ఐక్యత చెక్కు చెదరకుండా వారిని సమీకరించడంతో పాటు మతతత్వ శక్తులను ఎదుర్కోవడమే ఈ సదస్సు ఉద్దేశమని పేర్కొంది.
ఏపీలో పరిస్థితికి కాంగ్రెస్‌దే బాధ్యత
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని ఏచూరి చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు ప్రభుత్వం కానీ, అటు కాంగ్రెస్ కానీ చేసిందేమీ లేదన్నారు. నీళ్లు, ఇంధన పం పకం, తదితర కీలక అంశాల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని విమర్శించారు. కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం అట్టుడికిపోతోందని చెప్పారు.