'మీ ఇష్టం.. వారికి మాత్రం ఓటెయ్యొద్దు'
పాట్నా: 'ఓటును మీ ఇష్టం వచ్చినవారికి వేయండి.. కానీ నితీశ్ కుమార్కు, లాలూ ప్రసాద్కు మాత్రం వేయకండి. ఎందుకంటే వారిద్దరు మోసగాళ్లు' అంటూ తీవ్ర స్థాయిలో ములాయం సింగ్ యాదవ్ ఓటర్లకు సూచించారు. బీహార్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఓ ర్యాలీలో పాల్గొన్న ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్పై తీవ్ర విమర్శలు చేశారు. 'లాలూ, నితీశ్ పెద్ద మోసగాళ్లు. ఇద్దరూ నన్ను మోసం చేశారు.
వారిద్దరు నావద్దకు వచ్చి బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేద్దామని కోరారు. అందుకు సరేనని తాను అంగీకరించాను. అంతలోనే నాతో మాటైనా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి పలువురు సామాజిక వాదులను కాంగ్రెస్ పార్టీ జైలులో వేసింది. అలాంటి పార్టీతో వారు కలిసిపోయారు. మా పార్టీకే పూర్తి స్థాయిలో పట్టం కట్టాలని నేను కోరడం లేదు. కనీసం భారీ స్థానాలు వచ్చేలా సహకరించండి.
ఎందుకంటే మా మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు అనేది జరగదు' అంటూ ములాయం ఓటర్లకు చెప్పారు. పన్నేండేళ్లపాటు బీజేపీతో కొనసాగి తాజాగా ఆ పార్టీని విమర్శించే హక్కు నితీశ్కు లేదని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ములాయం అందులో నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.