మా సీఎం గారికి లెక్చర్లు ఇవ్వక్కర్లేదు
బిహార్ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికార కూటమిలోని జేడీ(యూ), ఆర్జేడీ మధ్య విభేదాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రెండు పార్టీలకు చెందిన నాయకులు పరస్పర విమర్శలు సంధించుకుంటున్నారు. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించగానే ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్, జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ గట్టిగా కౌగిలించుకున్నారు. తన తమ్ముడు రాష్ట్రంలో చూసుకుంటాడని, తాను జాతీయస్థాయికి వెళ్తానని లాలు అప్పట్లో చెప్పారు. కానీ.. బిహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి క్రమంగా విషమించడం, వరుసగా ముగ్గురు ఇంజనీర్ల హత్యలు జరగడంతో అక్కడ 'ఆటవిక రాజ్యం' వచ్చిందన్న విమర్శలు మొదలయ్యాయి. దీంతో లాలు ప్రసాద్ కూడా నితీష్ సర్కారు మీద చురకలు వేశారు. శాంతిభద్రతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా డబ్బులివ్వాలని బెదిరిస్తూ ఫోన్ చేస్తే తనను కలవాలని.. వెంటనే చర్యలుండేలా తాను చూస్తానని లాలు చెప్పారు. అంతేకాదు, లాలు పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశప్రసాద్ కూడా దీనిపై స్పందించారు. శాంతి భద్రతల పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వంలో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రి నితీష్ కుమారే చూడాలని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సీఎం నితీష్ కుమార్ మౌనంగానే ఉన్నా.. ఆయన పార్టీ వాళ్లు మాత్రం దానిపై కాస్త ఘాటుగానే స్పందించారు. నితీష్‌కుమార్‌కు ఎవరూ లెక్చర్లు ఇవ్వనక్కర్లేదని, ఆయన ట్రాక్ రికార్డు ఎంచక్కా ఉందని జేడీ(యూ) అధికార ప్రతినిధి సంజయ్ కుమార్ సింగ్ అన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు బద్ధ శత్రువులుగా ఉన్న నితీష్.. లాలు ఏడాది క్రితం మళ్లీ కలిశారు. తామిద్దరి ఉమ్మడి శత్రువైన బీజేపీని ఎదుర్కోడానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించారు. కానీ ఆ ముచ్చట మూణ్ణాళ్ల కూడా నిలవకముందే పరస్పర విమర్శలు మొదలయ్యాయి.