‘జనతా’ బ్రదర్స్ జయభేరి | janatha brothers win in bihar elections | Sakshi
Sakshi News home page

‘జనతా’ బ్రదర్స్ జయభేరి

Published Mon, Nov 9 2015 2:42 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

‘జనతా’ బ్రదర్స్ జయభేరి - Sakshi

‘జనతా’ బ్రదర్స్ జయభేరి

  • బిహార్ ఎన్నికల్లో ‘మహా’ విజయం
  • 178 స్థానాలు కైవసం.. మూడింట రెండొంతుల మెజారిటీ
  • ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 స్థానాల్లో జయకేతనం
  • కేవలం 58 స్థానాల్లో గెలుపుతో చతికిలపడిన ఎన్డీయే
  • బీజేపీకి 53, ఎల్‌జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీకి చెరో రెండు సీట్లు
  • 21 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీటు గెల్చుకున్న మాంఝీ పార్టీ
  • మూడోసారి బిహార్ సీఎం పీఠం అధిష్టించనున్న నితీశ్‌కుమార్
  • బిహార్ ప్రజలు సంచలన తీర్పునిచ్చారు. మోదీ, నితీశ్‌ల హోరాహోరీ పోరులో బాహరీ (బయటివాడు)ని కాదని.. బిహారీకే పట్టం కట్టారు. మోదీ చరిష్మాను పక్కనబెట్టి నితీశ్ ఇమేజ్‌కే ఓటేశారు. ముచ్చటగా మూడోసారి నితీశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమికి తిరుగులేని మెజారిటీనిచ్చారు. కూటమి నేతలు సైతం ఊహించని స్థాయిలో మూడింట రెండొంతుల స్పష్టమైన మెజారిటీని వారికి అందించారు. ముఖ్యంగా ‘జనతా’ సోదరులు నితీశ్(జేడీయూ), లాలూ ప్రసాద్(ఆర్జేడీ)లకు ఓట్ల హారతి పట్టారు.
     
     పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకు గానూ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా కూటమి 178 సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 58 స్థానాలకే పరిమితమైంది. మహాకూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 80 స్థానాల్లో, జనతాదళ్(యునెటైడ్) 71 సీట్లలో, కాంగ్రెస్ 27 స్థానాల్లో విజయం సాధించాయి. ఆర్జేడీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో, కాంగ్రెస్ 41 స్థానాల్లో పోటీ చేశాయి. ఎన్డీయే తరఫున బీజేపీ అత్యధికంగా 53 సీట్లు గెలుచుకోగా, ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ చెరో రెండు స్థానాల్లో గెలుపొందాయి.
     
     మాజీ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్‌ఏఎం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ఎన్డీయే నుంచి బీజేపీ 159 సీట్లలో పోటీ చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం, పప్పూయాదవ్‌కు చెందిన జనాధికార పార్టీ ఖాతా తెరవలేకపోయాయి.  సీపీఐ(ఎంఎల్) 3, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాధించారు. నితీశ్‌కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కూటమి సారధిగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు.
     
     2010 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, జేడీయూలు 206 స్థానాల్లో విజయం సాధించాయి. అందులో జేడీయూ 115, బీజేపీ 91 సీట్లు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఆర్జేడీ 22 సీట్లలో, కాంగ్రెస్ కేవలం 4 స్థానాల్లో గెలుపొందాయి. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన జేడీయూ, ఆర్జేడీలు అనూహ్యంగా, అతితక్కువ సమయంలోనే తేరుకోవడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 40 స్థానాలకు గానూ 31 స్థానాలు గెలుచుకుంది.
     
     బిహార్ ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని విజయానంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు వెల్లడించారు. విభజన శక్తుల కుట్రలను కాదని, అభివృద్ధి ఎజెండాకే బిహార్ ప్రజలు పట్టం కట్టారని నితీశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రకటించారు. మతవాద బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తానని లాలూ ప్రసాద్ ప్రకటించారు.
     
     ఆ ఇద్దరూ ‘చేతు’లు కలిపితే..
     లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం బిహార్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కలిసి పోటీచేసిన ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లు 10 సీట్లకు గానూ ఆరింటిలో విజయం సాధించడంతో.. మహా కూటమి ఏర్పాటుకు దారులు పడ్డాయి. బీజేపీని కలసికట్టుగా ఎదుర్కోవడమే మార్గమని భావించిన ఆ మూడు పార్టీలు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కటై మహా కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడ్డాయి. మరోవైపు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు, అసహనంపై దేశవ్యాప్త ప్రచారం, మోదీ ‘డీఎన్‌ఏ’ కామెంట్ బీజేపీకి ప్రతికూలంగా పరిణమించ గా.. నితీశ్ క్లీన్ ఇమేజ్, లాలూ కుల సమీకరణాలు కూటమి గెలుపునకు బాటలు వేశాయి.
     
     మోదీకి మరో ఎదురుదెబ్బ
     ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బిహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ.. సుడిగాలి పర్యటనల్తో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రధాని చేయని రీతిలో దాదాపు 30కి పైగా సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. దాంతో ఈ ఓటమిని మోదీ వ్యక్తిగత పరాజయంగా ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం సాధించింది.
     
     తరువాత జరిగిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో పీడీపీతో కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించింది. ఆ తరువాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలయింది. మొత్తం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 67 స్థానాలు గెల్చుకోగా, బీజేపీ 3 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. అనంతరం ఈ ఎన్నికలు మోదీకి, బీజేపీకి ఊహించని స్థాయిలో ఘోర పరాజయాన్ని మిగిల్చాయి.
     
     ఇది ఏ ఒక్క పార్టీ విజయమో కాదు. ఇది మహాకూటమి సంయుక్తంగా సాధించిన విజయం. మా మధ్య విభేదాలు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. అది విఫలయత్నమే అవుతుంది. కనీసం మరో పది జన్మల పాటు మేం కలిసే ఉంటాం. నరేంద్రమోదీ నేతృత్వంలోని మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. అందులో భాగంగా దేశమంతా పర్యటిస్తాం. బీజేపీయేతర పార్టీలు ఇందుకు కలసిరావాలి.
     - లాలూప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ)
     
     బీజేపీ చాలా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. బిహార్ ప్రజలు చాలా పరిణతితో ఓట్లేశారు. దళితులు, మహిళలు, యువత, మైనారిటీలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల మద్దతు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు.  కుల, మతాలకు అతీతంగా ప్రజలు మాకు అనుకూలంగా ఓటేశారు. వారికి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా.      - నితీశ్‌కుమార్ (జేడీయూ)
     
     బిహార్ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తూ, ఓటమిని అంగీకరిస్తున్నాం. ఘనవిజయం సాధించిన నితీశ్, లాలూలకు అభినందనలు తెలియజేస్తున్నా.
     - అమిత్ షా (బీజేపీ)
     
     బిహార్‌లో మహాకూటమి గెలుపు...
     విద్వేషంపై ప్రేమ.. విభజనపై ఐక్యత.. అసహనంపై సహనం సాధించిన విజయం.. మోదీ విదేశీ పర్యటనలను పక్కనబెట్టి రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి.
     - రాహుల్ గాంధీ (కాంగ్రెస్)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement