ప్రధాని రాజీనామా చేయాల్సిందే: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మన్మోహన్ తన పదవికి రాజీనామా చేసి, సీబీఐ విచారణను ఎదుర్కోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2జీ స్పెక్ట్రమ్ మొదలు కోల్ గేట్ వరకు కుంభకోణాలన్నింటిలో ప్రధాని ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆరోపించింది. బీహార్ రాజధాని పాట్నాలో మోడీ సభ వద్ద జరిగిన పేలుళ్లు, ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి తనను పిలిచిన జేపీసీ విచారణకు రాకుండా.. పిలవని సీబీఐ వాళ్ల ఎదుట విచారణకు హాజరవుతానంటున్నారని ప్రతాప్ రూడీ ఎద్దేవా చేశారు. మోడీ సంయమనం పాటించి ఉండాల్సిందని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మోడీ ఓర్పు, సంయమనం, సమయానుకూలత, పరిణతి పాటించకపోయి ఉంటే పాట్నా భస్మీపటలమై ఉండేదని.. దేశం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లోకి వెళ్లి ఉండేదని పేర్కొన్నారు.
ఐదు చోట్ల బాంబులు పేలిన విషయం తెలిసినా మోడీ మనోనిబ్బరాన్ని ప్రదర్శించి సభకు వచ్చిన వారిలో మనోధైర్యాన్ని నింపారని కొనియాడారు. హైదరాబాద్‌లో పేలుళ్లకు పాల్పడ్డవారే పాట్నాలోనూ తెగబడ్డారని, ఈ రెండింటికీ సారుప్యత ఉందని రూడీ చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, అరుణజ్యోతి, ప్రదీప్, ఎస్.కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కాషాయమయం చేయండి: రాష్ట్రాన్ని కాషాయీకరణ చేయాలని రూడీ బీజేపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఆయన హైదరాబాద్‌లో పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మోడీ పట్ల సానుకూలతతో పాటు పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.
సామాన్యుడికి భద్రత కరవు: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగా రాష్ర్టంలో సామాన్యుడికి భద్రత కరవైందని బీజేపీ జాతీయ కార్యదర్శి కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం శాంతిభద్రతలపై దృష్టిసారించకపోవడం వల్ల తరచూ బాంబుపేలుళ్లు, అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అసలు సర్కారే లేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ఈ అనిశ్చితిని తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు డాక్టర్ ఎస్.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.కుమార్‌లతో కలిసి ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. కేంద్రం తరఫున రాష్ట్రంలో పర్యటించబోయే టాస్క్ ఫోర్స్ ఇక్కడి శాంతిభద్రతలపై దృష్టి సారించాలని కోరారు.