
వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదు: మోదీ
న్యూఢిల్లీ: ఉడీ దాడికి బాధ్యులైనవారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో ముచ్చటించిన మోదీ.. ఉడీ దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు. ఈ విషయంలో సైన్యం మాట్లాడదని.. తన పరాక్రమాన్ని చూపిస్తుందన్నారు.
ఇటీవల పారాలింపిక్స్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు దేశం గర్వించేలా చేశారని మోదీ అభినందించారు. పారాలింపిక్స్లో మరింత ప్రతిభ కనబరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటీవల గుజరాత్లో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన దివ్యాంగుల గురించి ప్రస్తావించిన మోదీ.. అది తనకు ఉద్వేగపూరితమైన, అద్భుతమైన అనుభవమని వెల్లడించారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజలకు పరిశుభ్రతపై మరింత అవగాహన పెరిగిందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. స్వచ్ఛతా హెల్ప్లైన్ నంబర్గా 1969 ను మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామీణ భారతంలో ఇప్పటివరకు 2.48 కోట్ల టాయ్లెట్లను నిర్మించామని.. వచ్చే ఏడాది మరో 1.5 కోట్ల టాయ్లెట్లను నిర్మించనున్నట్లు మోదీ తెలిపారు. తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తుండటం పట్ల కశ్మీరీ ప్రజలను మోదీ అభినందించారు. గాంధీ జయంతి నుంచి దీపావలి మధ్య కాలంలో దేశ ప్రజలు ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.