
1965 నాటి పరిస్థితులున్నాయ్!
♦ ఉడీ ఘటనపై దేశమంతా ఆగ్రహం
♦ కశ్మీర్‌కు శాంతి, ఐకమత్యంతోనే పరిష్కారం
♦ మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉడీ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసిందని.. దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ సందర్భంగా ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉడీ ఘటనలో అమరులైన 18 మంది జవాన్లకు నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని ప్రసంగించిన ప్రధాని.. ఇది వారి కుటుంబాలకు జరిగిన నష్టం మాత్రమే కాదని.. యావద్భారతంలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయన్నారు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపించాయన్నారు. జాతీయవాదం ఉవ్వెత్తున ఎగసిపడి.. ప్రతి ఒక్కరూ దేశం కోసం ఏదో చేయాలని సిద్ధమయ్యారని గుర్తుచేశారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రజల ఆవేశాన్ని సరైన మార్గంలో వినియోగించేందుకు ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని ఇచ్చారని.. దీని ద్వారా సామాన్య ప్రజలు కూడా దేశం కోసం పనిచేసేందుకు స్ఫూర్తి పొందారన్నారు. మహాత్మాగాంధీ కూడా స్వాతంత్య్రోద్యమ సమయంలో నిర్మాణాత్మకమైన కార్యాచరణ ద్వారానే మార్గదర్శనం చేశారన్నారు. ఉడీ ఘటనకు ఆర్మీ చేతల్లో సమాధానం చెబుతుందన్నారు.
శాంతితోనే ‘కశ్మీర్’కు పరిష్కారం
రెండు నెలలుగా కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులతో అక్కడి ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందుల పాలయ్యారు. దేశ వ్యతిరేక శక్తులను వారు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. వారికి వాస్తవం బోధపడుతున్న కొద్దీ ఇలాంటి దుష్టశక్తుల నుంచి దూరమై శాంతివైపు మరలుతున్నారన్నారు. ‘తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాలయాలకు పంపాలనుకుంటున్నారు. రైతు తను పండించిన దాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఆర్థిక కార్యకలాపాలు మొదలవ్వాలి. కొన్ని రోజులుగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శాంతి, ఐకమత్యం, సామరస్యం ద్వారా వారి సమస్యకు పరిష్కారం లభిస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. అటు భద్రతా దళాలు కూడా ఆయుధాలు, అధికారాలను శాంతి భద్రతలకోసమే వినియోగించుకుని శాంతియుత వాతావరణానికి సహకరించాలన్నారు.
పారాలింపిక్స్ విజేతలకు శుభాకాంక్షలు
ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ తరపున పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమం విజయవంతం అవుతోందని.. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెరిగిందన్నారు. ప్రధాని అధికారిక నివాసాన్ని 7 రేస్‌కోర్సు రోడ్ నుంచి లోక్‌కల్యాణ్ మార్గ్‌కు మార్చటంపై సానుకూలంగా స్పందించారు.