ముగ్గురిని మింగేసిన మ్యాన్‌హోల్
Published Tue, Mar 7 2017 10:18 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు మ్యాన్‌హోల్‌లోకి దిగి ప్రమాదవశాత్తూ మరణించారు. మృతులు ముగ్గురూ ఏపీకి చెందిన వలస కార్మికులు కావటం గమనార్హం. సోమవారం రాత్రి కృష్ణరాజపురం పరిధిలోని కగ్గదాసపురంలో ఈ ఘటన జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం కార్మికులైన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రామచంద్రాపురానికి చెందిన ఆంజనేయరెడ్డి (34), శ్రీకాకుళ జిల్లా చెంగేడిపేట మండలం కలవలుస గ్రామానికి చెందిన యర్రయ్య(35), శ్రీకాకుళానికి చెందిన దవితానాయుడు అలియాస్ డీబీ నాయుడు(40) పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వచ్చారు. వీరిలో ఆంజనేయరెడ్డి సైట్ ఇంజినీర్‌గా, మిగతా ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో కగ్గదాసపురలో మ్యాన్‌హోల్‌లో మురుగు ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఆంజనేయరెడ్డి, యర్రయ్య, దవితా నాయుడు మ్యాన్‌హోల్ వద్దకు చేరుకున్నారు. ఎలాంటి రక్షణ కవచాలు లేకుండానే యర్రయ్య, దవితా నాయుడు 15 అడుగుల లోతున్న మ్యాన్‌హోల్‌లోకి దిగి మరమ్మతు ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత ఆక్సిజన్ అందక గట్టిగా కేకలు వేశారు. దీంతో పైన ఉన్న ఆంజినేయరెడ్డి తాడు సాయంతో లోపలికి దిగాడు. ఈ క్రమంలోనే ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కాంట్రాక్టర్లు, జలమండలి అధికారులు సరైన జాగ్రత్త చర్యలను పాటించకకుండా నిర్లక్ష్యం వహించడంతోనే కార్మికులు తనవు చాలించారని స్థానికులు ఆరోపించారు. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కె.జె.జార్జ్, పాలికె మేయర్ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతదేహాలను బోరింగ్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బయపనహళ్లి పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement