గార్డును చంపేసిన పులి
జైపూర్:రాజస్థాన్ రాష్ట్రంలోని జాతీయ పార్కులో విషాదం చోటు చేసుకుంది. రణతంబోర్ జూపార్కులో గార్డుపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత సాయంత్రం రామ్ పాల్ శైనీ జూపార్కు గార్డు మరో ఇద్దరితో కలిసి పార్కు పర్యవేక్షణకు వెళ్లాడు.
ఈ క్రమంలోనే పులి ఆకస్మికంగా రామ్ పాల్ పై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రి తీసుకువెళ్లి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని పోలీసులు తెలిపారు. కాగా, జూపార్కు గార్డు మృతిపట్ల రాష్ట్ర సీఎం వసుంధరా రాజే ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు అతని కుటుంబం వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు. అతని కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు, ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే జూపార్కులో పులి దాడి చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జూలో పులులు మనుషులపై దాడులు చేసే అవకాశాలు చాలా తక్కువని అక్కడ సిబ్బంది పేర్కొన్నారు. ఒకవేళ సాయంత్రం వేళ కావడంతో మరో జంతువుగా భావించే పులి దాడి చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.