వచ్చే ఏడాది యూపీ, పంజాబ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది యూపీ, పంజాబ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా.. పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్‌కు యూపీ, కమల్‌నాథ్‌కు పంజాబ్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించింది. యూపీలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతోపాటు బీఎస్పీతో సత్సంబంధాలున్నందున పొత్తుకు ఒప్పించేందుకే ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న ఆజాద్.. అంతకుముందు రెండుసార్లు యూపీ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో హరియాణా కాంగ్రెస్ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే తప్పుచేశారన్న వార్తల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సరిదిద్దటంతోపాటు, పంజాబ్‌లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రాష్ట్రాల బాధ్యతలను కమల్‌నాథ్‌కు అప్పగించారు.