
నేడే రంజాన్ పండుగ
న్యూఢిల్లీ : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను దేశవ్యాప్తంగా గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. దేశంలోని ముస్లింలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అభివర్ణించారు. అలాగే వివిధ దేశాల నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఈద్-ఉల్-ఫితర్‌ను బుధవారమే జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలకు వెళ్ళి భక్తి శ్రద్దలతో ప్రత్యేకప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా శ్రీనగర్‌లోని హాజరత్‌బల్ మసీదులో 50 వేల మంది ప్రార్థనలు చేశారు. దీని తరువాత శ్రీనగర్ పాతబస్తీలోని ఈద్గాలో 40 వేల మంది ప్రార్థనలు చేశారు.
శ్రీనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
శ్రీనగర్ : శ్రీనగర్‌లోని సఫక్‌దల్‌లోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై దుండగులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో 30 మంది గాయపడ్డారు. పోలీస్ అధికారితో పాటు, 20 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డ వారిలో ఉన్నారు. వేర్పాటువాద నేతలు గిలానీ, ఉమర్ ఫరూఖ్, యాసీన్ యాసీన్‌లను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.